20 కోట్లు పెడితే 3 కోట్లు కూడా రాలేదు

ఈ రోజుల్లో అయితే సినిమాలు హిట్ట‌వుతున్నాయి. లేదంటే ఫ్లాప్ అవుతున్నాయి. అంతే త‌ప్ప మ‌ధ్య‌స్థంగా ఉండ‌ట్లేదు. టాక్ బాలేని సినిమాలు యావ‌రేజ్‌గా ఆడటం గ‌గ‌నం అయిపోతోంది. ఇక ఫుల్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలైతే.. మినిమం ఓపెనింగ్స్ లేకుండా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌తికిల‌ప‌డుతున్నాయి. గ‌త శుక్ర‌వారం రిలీజైన రామ‌బాణం ప‌రిస్థితి ఇలాగే త‌యారైంది.

మార్నింగ్ షోకే విప‌రీత‌మైన నెగెటివ్ టాక్ రావ‌డంతో ఈ సినిమా ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంది. గోపీ కెరీర్లోనే ఇది అతి పెద్ద డిజాస్ట‌ర్ అయింది. గోపీ వ‌రుస ఫెయిల్యూర్ల‌తో స‌త‌మ‌తం అవుతుండ‌టం, ట్రైల‌ర్ కూడా బాలేక‌పోవ‌డంతో రామ‌బాణం మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయ‌లేక‌పోయింది జ‌నాల్లో. గోపీ, శ్రీవాస్‌ల‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అయినా.. రామ‌బాణం ప‌ట్ల జ‌నాల్లో ఆస‌క్తి క‌ల‌గ‌లేదు. దీని వ‌ల్ల అడ్వాన్స్ బుకింగ్స్ క‌ర‌వ‌య్యాయి.

దీనికి తోడు సినిమాకు బాగా నెగెటివ్ టాక్ రావ‌డంతో మార్నింగ్ షోలకే డిజాస్ట‌ర్ అని తేలిపోయింది. ఏ ద‌శ‌లోనూ వ‌సూళ్లు పుంజుకోలేదు. ఆక్యుపెన్సీలు పెర‌గ‌లేదు. వీకెండ్లోనే సినిమా వాషౌట్ అయిపోయింది. ఈ సినిమా బ‌డ్జెట్ రూ.20 కోట్ల పైమాటేన‌ట‌. కానీ రూ.4 కోట్ల షేర్ కూడా ఈ సినిమా రాబ‌ట్ట‌లేక‌పోయింది. ఫుల్ ర‌న్ షేర్ కేవ‌లం రూ.2.5 కోట్లు మాత్ర‌మేన‌ట‌. దీన్ని బ‌ట్టే రామ‌బాణం ఎంత పెద్ద డిజాస్ట‌రో అర్థం చేసుకోవ‌చ్చు.

గ‌త ఏడాది కార్తికేయ‌న‌-2, ద‌స‌రా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్లు చూసిన పీపుల్స్ మీడియా సంస్థ‌కు ఈ చిత్రం భారీ న‌ష్ట‌మే మిగిల్చింది. హిట్ కాంబినేష‌న్ చూసి అయిన కాడికి బ‌డ్జెట్ పెట్టిన ఆ సంస్థ త‌ల బొప్పి క‌ట్టించుకుంది. ఈ సినిమా ఫ‌లితం గోపీ, శ్రీవాస్‌ల కెరీర్ల‌కు పెద్ద బ్రేక్ వేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.