పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు తొమ్మిదేళ్లుగా ట్విట్టర్లో ఉన్నాడు. కానీ ఏ రోజూ ఆయన అకౌంట్ నుంచి సినిమా ట్వీట్ పడింది లేదు. ఆ అకౌంట్‌ను పూర్తిగా రాజకీయాలు, సామాజిక అంశాల గురించి ట్వీట్ చేయడానికే వాడుతున్నాడు పవన్. ఎప్పుడూ కూడా సినిమాల ప్రస్తావనే తీసుకురాడు పవన్. ఐతే ఇప్పుడు ఆయన తన కొత్త సినిమా ఓజీకి సంబంధించి ఒక ట్వీట్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాకపోతే అందులో కూడా రాజకీయ కోణం దాగి ఉంది.
పవన్ ఇటీవలే ముంబయికి వెళ్లి సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సముద్ర తీరంలో షూట్ జరుగుతుండగా.. పవన్ వెనుక నుంచి కనిపిస్తున్న పొటో ఒకటి తనే స్వయంగా ట్వీట్ చేశాడు. పవన్ ఇలా ఆన్ లొకేషన్ ఫొటో రిలీజ్ చేయడం విశేషమే. కాకపోతే అక్కడ ముగ్గురు జనసైనికులు జనసేన జెండా పట్టుకుని పవన్‌కు అభివాదం చేస్తున్నారు. ముంబయిలో కూడా జనసైనికులు తనను విష్ చేయడం పట్ల ఆనందంతో పవన్ వారి పేర్లను కూడా ప్రస్తావిస్తూ ఈ ఫొటోను షేర్ చేశాడు.
విశేషం ఏంటంటే.. ఇందులో పవన్ లుక్ ఖుషి సినిమాను గుర్తుకు తెస్తోంది. ఆ సినిమా ఆరంభ సన్నివేశాల్లో ఒక పార్క్‌లో కూర్చుని పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. సరిగ్గా అలాంటి డ్రెస్సులోనే పవన్ కనిపిస్తున్నాడు. ఓజీ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని.. ఈ కథకు జపాన్ దేశంతో సంబంధం ఉంటుందని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అది నిజమే అని పవన్ షేర్ చేసిన లుక్ చూస్తే అర్థమవుతోంది. ఏదేమైనప్పటికీ పవన్ నుంచి ఇలా ఓజీ ఆన్ లొకేషన్ ఫొటో ట్వీట్‌గా పడటం అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates