కొత్త ఏడాదిలో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు హవా గురించి ఈ మధ్య టాలీవుడ్లో అందరూ మాట్లాడుకున్నారు. సంక్రాంతికి తన సంస్థ నుంచి రిలీజ్ చేసిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’తో ఆయన మంచి లాభాలే అందుకున్నారు. ఆ తర్వాత ‘బలగం’ పెట్టుబడి మీద ఎన్నో రెట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. అలాగే రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన ‘దసరా’ సహా చాలా సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి.
2023 రాజుకు లక్కీ ఇయర్ లాగా మారిందనే చర్చ నడిచింది. ఐతే ఈ చర్చ వల్ల దిష్టి తగిలేసిందో ఏమో.. తన కొత్త సినిమాతో రాజు చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఆయన నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ రూ.80 కోట్లని మేకర్స్ చెప్పుకున్నారు. అంత అయ్యే ఛాన్స్ లేదని.. కానీ 50 కోట్లకు అయితే తక్కువ ఖర్చు అయి ఉండదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఇందులో రాజు వాటా ఎంత అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ఆయన ఈ సినిమా వల్ల కొన్ని కోట్లు నష్టపోయారన్నది స్పష్టం. నిజానికి ఇది దిల్ రాజు సొంతంగా ఓకే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా కాదు. మధ్యలో ఈ ప్రాజెక్టులోకి దూరారు. ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తీసి మంచి ఫలితాన్నందుకున్నాడు గుణశేఖర్. ఆ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది రాజే. ఆ సినిమాతో గుణశేఖర్ చేసిన మ్యాజిక్ చూసి ఇంప్రెస్ అయి.. ‘శాకుంతలం’ అనౌన్స్ చేసి సెట్స్ మీదికి వెళ్లిన కొంత కాలానికి ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యాడు రాజు.
కథతో పాటు ఈ సినిమా తీయడానికి గుణశేఖర్ చేసుకున్న ప్లానింగ్ నచ్చి ఇందులో తానెందుకు భాగం కాకూడదు అనుకున్నట్లు రాజు గతంలో తెలిపాడు. అలా గుణశేఖర్ అడక్కపోయినా.. కోరి ఈ సినిమాలోకి వచ్చాడు రాజు. జడ్జిమెంట్ కింగ్‌గా పేరున్న రాజు.. ఈ సినిమా విషయంలో తప్పటడుగు వేశాడన్నది స్పష్టం. అందుకు ఫలితంగా నష్టాలు భరించక తప్పట్లేదు.