టాలీవుడ్లో సినిమాలకే పూర్తిగా అంకితమైన కుటుంబాల్లో సాయికుమార్‌ది ఒకటి. ఆయన తండ్రి పీజే శర్మతో మొదలుపెట్టి.. కొడుకు ఆది వరకు సినిమాల్లోనే కెరీర్ వెతుక్కున్నారు. ఐతే శర్మతో పాటు సాయికుమార్ కూడా ఇండస్ట్రీలో అంత తేలిగ్గా ఏమీ నిలదొక్కుకోలేదు. ఎన్నో ఇబ్బందులు పడి.. చివరికి ఈ రంగంలో సెటిలయ్యారు.
ఐతే కెరీర్లో నిలదొక్కుకున్నాం.. ఇక ఏ ఇబ్బందీ లేదు అనుకున్నాక కూడా తమను కష్టాలు వెంటాడాయని.. తన తమ్ముడు అయ్యప్ప శర్మ దర్శకత్వంలో తాను హీరోగా, తన తండ్రి విలన్‌గా నటిస్తూ సొంతంగా నిర్మించిన ‘ఈశ్వర్ అల్లా’ తమ కుటుంబాన్ని రోడ్డు మీదికి తెచ్చేసిందని.. ఈ సినిమా వల్ల తన తండ్రి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా చేశాడని తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో సాయికుమార్ వెల్లడించాడు.
‘ఈశ్వర్ అల్లా’ సినిమాకు అప్పట్లోనే రూ.2 కోట్లు ఖర్చయిందని.. అది అప్పటికి భారీ బడ్జెట్ అని.. ఐతే బయ్యర్లు ఎవరికీ సినిమా నచ్చలేదని.. కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదని సాయికుమార్ చెప్పాడు. ఇందులో విలన్ పాత్రను తన తండ్రితో వేయించడం పెద్ద తప్పని.. సినిమా చివర్లో హీరోగా తాను ఆయన్ని కొట్టడం ఎవరికీ రుచించలేదని.. తండ్రిని కొడుకు కొట్టడం ఏంటనే ఫీలింగ్‌తో సినిమాను జనం తిరస్కరించారని అన్నాడు.
సినిమా విడుదల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవగా.. దాసరి నారాయణరావు జోక్యం చేసుకుని రిలీజ్ చేయించారని.. ఈ సినిమా వల్ల నష్టపోతే అవసరమైతే తనను హీరోగా పెట్టి సినిమా తీసి పెడతానని ఆయన భరోసా ఇచ్చి సినిమా విడుదలయ్యేలా చూశారని.. కానీ సినిమా ఆడకపోవడంతో రెండు కోట్ల అప్పులు మిగిలాయని.. వీటిని తీర్చడానికి తనకు ఐదేళ్లకు పైగా సమయం పట్టిందని.. 15 సినిమాలు చేసి వాటి ద్వారా వచ్చిన పారితోషకాలతో ఆ అప్పులన్నీ తీర్చానని చెప్పుకొచ్చారు సాయి.