సినిమా కెరీర్ కలిసి రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పలేదు. సినిమాల మీద ఆశలు వదులుకుని.. వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకుని ఇక రాజకీయాల్లో అడుగు పెడదాం అనుకుని ఆ వైపు చూస్తే.. ఊహించని పరిణామం ఎదురైంది. యువగళం యాత్రలో పాల్గొన్న తొలి రోజే గుండెపోటుకు గురయ్యాడు నందమూరి తారకరత్న. ఆ తర్వాత ఆసుపత్రి పాలై మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడతను.
తారకరత్న చనిపోయాక అతడి మంచితనం, తన జీవితంలోని కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. తన భర్త గురించి కొన్ని రోజులుగా ఎమోషనల్ పోస్టులు పెడుతోంది అలేఖ్య రెడ్డి. తాజాగా ఆమె ఇలాంటి పోస్టే ఒకటి పెట్టింది. అందులో తారకరత్న ఎదుర్కొన్న సమస్యలు, మానసిక వేదన గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
మన పెళ్లి తర్వాత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మనం వివక్ష ఎదుర్కొన్నాం. ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగాం. నిష్క పుట్టాక మన జీవితం ఎంతో మారింది. కానీ ఏదో రకంగా ద్వేషాన్ని ఎదుర్కొన్నాం. 2019లో అద్భుతం జరిగింది. మనకు కవలలు పుట్టారు. మనకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంటే బాగుంటుందని నువ్వనుకున్నావు. చివరి వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు. సొంతవాళ్ల వల్లే నీ మనసుకు బాధ కలిగింది. ఎవ్వరూ దాన్ని అర్థం చేసుకోలేదు. నేను కూడా నీ బాధ తగ్గించలేకపోయా. మనం కోల్పోయిన వాళ్లు నీ చివరి చూపుకు కూడా రాలేదు. మనతో మొదట్నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్లే చివరిదాకా అండగా నిలిచారు. నీతో ఉన్నది తక్కువ సమయమే అయినా.. నేను నీ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నాను అని తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో అలేఖ్య పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించనే చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates