మహేష్ 28 టైటిల్స్ ఏవీ నిజం కాదు

హిట్టు ఫ్లాపు ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటిగా పేరున్న మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పక్కా ప్లానింగ్ తో వేగం పెంచారు. అసలే నిర్మాత నాగవంశీ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్లిపోతామని చెప్పడం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనరని చెబుతూనే కలెక్షన్ల సునామి ఖాయమని చెప్పడం ఆసక్తి రేపుతోంది. టైటిల్ కు సంబంధించి రకరకాల ప్రచారాలు ఫిలిం నగర్ వర్గాల్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కొన్ని నమ్మేలా ఉండగా మరికొన్ని కామెడీగా అనిపిస్తున్నాయి. అయోధ్యలో అర్జునుడు అందులో మొదటిది. ఇదేదో రామాయణంకి మహాభారతంకు ముడిపెట్టినట్టు కనిపిస్తోంది. కేవలం అర్జునుడు పేరు కూడా చక్కర్లు కొడుతోంది. కాకపోతే గతంలో మహేష్ అర్జున్ చేయడం అదేమంత ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తీసుకోకపోవచ్చు. అతడే తన సైన్యం అనేది మరో టైటిల్. ఇది ఎప్పుడో ఒక్కడు కోసం నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడు గుణశేఖర్ అనుకున్నది. తర్వాత డ్రాప్ అయ్యారు. ఇది ప్రచారంలోకి రావడానికి కారణం అప్పటి పాత న్యూసే.

ఇక పెద్ద జోక్ గా అనిపించే టైటిల్ అమ్మకథ. మరీ ఓవర్ సెంటిమెంట్ కథలతో తీసే సినిమాలకు కూడా ఇలాంటివి పెట్టరు. అలాంటిది మహేష్ కోసం ఆలోచిస్తారంటేనే పెద్ద జోక్. ఆరంభం అని ఇంకో టాక్ ఉంది. వీటి సంగతలా ఉంచితే త్రివిక్రమ్ మాత్రం అ అక్షరంతో మొదలయ్యేదాన్ని పెట్టాలని చూస్తున్నారట. దీనికన్నా ముందు క్యాన్సిల్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టుకు అయినను పోయిరావలె హస్తినకు అనుకున్నారు. ఫైనల్ గా అసలివేవి కాదనేది వాస్తవం. ఉగాదికి టీజర్ లేదా టైటిల్ లాంచ్ చేస్తారనే మాట వినిపిస్తోంది కానీ సాధ్యమయ్యే సూచనలు తక్కువే.