నాటు నాటుకు ఆస్కార్.. అత‌నేం చేశాడు?


నాటు నాటు పాటకు గాను ఆస్కార్ పుర‌స్కారాన్ని సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ మాత్ర‌మే అందుకున్నారు కానీ.. నిజానికి ఈ పాట విజ‌యంలో చాలామంది పాత్ర ఉంది. ఆస్కార్ అకాడ‌మీ వాళ్లు అవార్డు కింద మ్యూజిక్ డైరెక్ట‌ర్, లిరిసిస్ట్‌ల‌ను స‌త్క‌రించడం ఆన‌వాయితీ కాబ‌ట్టి ఆ ఇద్ద‌రే అవార్డు తీసుకున్నారు. కానీ ఈ పాట‌కు నృత్య‌రీతులు స‌మ‌కూర్చిన ప్రేమ్ ర‌క్షిత్, అద్భుత‌మైన స్టెప్పుల‌తో అల‌రించిన జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌.. ఇక అంద‌రికీ మించి ద‌ర్శ‌కుడు ఈ పాట‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన‌ రాజ‌మౌళి.. ఇలా చాలామందికి ఈ అవార్డు ద‌క్కుతుంది. ఈ పాట స‌మ‌ష్టి కృషి అని రాజ‌మౌళి ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఐతే మ‌న‌కు క‌నిపించే వాళ్లు వీళ్ల‌యితే.. నాటు నాట వెనుక ఒక క‌నిపించ‌ని హీరో మ‌రొక‌రు ఉన్నాడు. అత‌నే.. ఎస్.ఎస్.కార్తికేయ‌. రాజ‌మౌళి, ర‌మ‌ల ముద్దుల కొడుకు. ఆర్ఆర్ఆర్ లైన్ ప్రొడ్యూస‌ర్.

ఆస్కార్ అవార్డు అందుకున్న సంద‌ర్భంగా త‌న ప్ర‌సంగంలో కీర‌వాణి ప్ర‌త్యేకంగా కార్తికేయ పేరు చెప్పి కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం తెలిసిందే. మ‌రి ఈ పాట విష‌యంలో కార్తికేయ చేసిన కృషి ఏంటో ఒక‌సారి చూద్దాం.

ఆర్ఆర్ఆర్ సినిమా లైన్ ప్రొడ్యూస‌ర్ అయిన కార్తికేయ‌.. నాటు నాటు పాట‌కు రూప‌క‌ల్ప‌న చేసిన ముఖ్య బృందంలో ఒక‌డు. ఈ పాట చిత్రీకరణ, తదితర విషయాలను అత‌ను దగ్గరుండి పర్యవేక్షించాడు. ఇక సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి అప్లాజ్ వ‌చ్చాక అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో కార్తీకేయ పాత్ర కీల‌కం. ఈ సినిమాను అస్కార్ అప్రూవ్డ్ థియేటర్లలో ప్రదర్శించేలా కార్తీకేయ చర్యలు తీసుకున్నాడు.టీసీఎల్ లాంటి థియేటర్లలో సినిమాను ప్రదర్శించటంతో ఆర్ఆర్ఆర్‌కు భారీ స్పందన వచ్చింది.

మ‌రోవైపు వెరైటీ లాంటి పేరున్న మ్యాగజైన్లో ఆర్ఆర్ఆర్ గురించి ఆర్టిక‌ల్స్ వ‌చ్చేలా చేసింది కార్తికేయ‌నే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అమెరికాలోని థియేటర్లలో తిప్పుతూ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ప్లాన్ చేసింది కూడా కార్తికేయ‌నే. జపాన్‌లో సినిమాకు భారీ రిలీజ్ ప్లాన్ చేసి అంత‌ర్జాతీయ స్థాయిలో సినిమాకు మ‌రింత ప్ర‌మోష‌న్ వ‌చ్చేలా చేశాడు. ఇలా నాటు నాటు ఆస్కార్ ద‌క్కించుకోవ‌డం వెనుక కార్తికేయ ప్ర‌మోష‌నల్ స్ట్రాట‌జీ చాలానే ఉంది.