సినిమాలు కళకళా థియేటర్లు వెలవెలా

మాములుగా కొత్త సినిమాలు విడుదలవుతున్నాయంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం ఏదో ఒక మూవీ లేనిదే నిద్రరాని టాలీవుడ్ వీరాభిమానులు ఎందరో ఉన్నారు. అయితే నెంబర్ చెప్పుకోవడానికి పెద్దగా ఉన్నా టికెట్ కౌంటర్లు మాత్రం వెలవెలబోవడం అప్పుడప్పుడు జరుగుతూ వస్తోంది. ఇవాళ అయిదారు చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకినా పబ్లిక్ లో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఆది సాయికుమార్ సిఎస్ఐ సనాతన్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లైతే దక్కాయి కానీ ఓపెనింగ్ ఎప్పుడో కోల్పోయిన ఈ యువ హీరోకి ఏదైనా అద్భుతం జరిగితేనే హిట్టు పడుతుంది.

ఇది కాకుండా మిస్టర్ కళ్యాణ్, నేడే విడుదల, టాక్సీ, వాడు ఎవడు, పులి ఇలా ఏవేవో వస్తున్నాయి కానీ ప్రమోషన్ల లోపం కారణంగా కనీసం వీటి పేర్లు జనాలకు రిజిస్టర్ కావడం కూడా అనుమానమే. హాలీవుడ్ మూవీ 65ని సైతం ఎవరూ పట్టించుకోవడం లేదని డల్ గా ఉన్న బుకింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి. ఒక రోజు ఆలస్యంగా రేపు వస్తున్న బ్రోచేవారెవరురాలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి హీరోలు. మనీ ఫేమ్ శివ నాగేశ్వరరావు చాల గ్యాప్ తీసుకుని తీసిన కామెడీ ఎంటర్ టైనరిది. ఇదీ టాక్ మీద ఆధారపడాల్సిందే. మరో వైపు తూ ఝూటి మై టక్కర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది.

ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి నెల మొత్తం పిల్లల పరీక్షల సీజన్ కావడంతో బడా నిర్మాతలెవరూ రిస్క్ చేయడం లేదు. ఎలాగూ పెద్దలు కూడా వాళ్ళను చదివించే ఉద్దేశంతో థియేటర్లకు దూరంగా ఉంటారు కాబట్టి సహజంగానే ఆ ఎఫెక్ట్ నేరుగా కలెక్షన్ల మీద పడుతోంది. అదృష్టవశాత్తు సార్ ఈ ముప్పు నుంచి తప్పించుకుని ఎగ్జామ్స్ కంటే ముందే వచ్చి లాభ పడింది. కమర్షియల్ చిత్రాలు మాత్రమే ఈ ట్రెండ్ కు ఎదురీది నిలుస్తాయి కానీ సమయానికి అవేవి లేకుండా పోయాయి. కబ్జా, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి, ధమ్కీ, దసరాలు ఏదైనా మేజిక్ చేస్తేనే రికవరీ మొదలువుతుంది.