బాహుబలి 2ని దాటిన పఠాన్ – సంతోషమే కానీ 

ఎట్టకేలకు బాలీవుడ్ నెంబర్ వన్ గ్రాసర్ గా పఠాన్ సింహాసనాన్ని అధీష్టించాడు. రిలీజై నలభై రోజులకు దగ్గరవుతున్నా ఆ తర్వాత వచ్చినవేవి కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో షారుఖ్ ఖాన్ జోరుకు బ్రేకులు పడటం లేదు. ఇప్పటిదాకా 511 కోట్లతో పఠాన్ హిందీ సినిమాల్లో తొలి స్థానాన్ని తీసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు బాహుబలి 2 పేరు మీద ఉంది. దానికొచ్చిన మొత్తం 510 కోట్లు. ఆ తర్వాతి స్థానాల్లో కెజిఎఫ్ టూ 434 కోట్లు, దంగల్ 374 కోట్లు, సంజు 342 కోట్లతో మిగిలిన టాప్ 4 ప్లేస్ తీసుకున్నాయి. ఒక డబ్బింగ్ చిత్రం టాప్ లో ఉందన్న నార్త్ నిర్మాతల కొరత తీరిపోయింది 

ఇదంత సులభంగా అయితే జరగలేదు. యష్ రాజ్ సంస్థ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఆఫర్లను ప్రకటించింది. మూడు వారాలు దాటాక 112 రూపాయలకే మల్టీ ప్లెక్స్ టికెట్లు అమ్మింది. ఇటీవలే బుక్ మై షో వన్ ప్లస్ వన్ అమలు చేసింది. అంటే ఒకటి కొంటె మరొకటి ఫ్రీ అన్నమాట. షెహజాదా రిలీజైన రోజే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి స్కీములు పెట్టి జనాన్ని లాగేశారని ట్రేడ్ వాపోయింది. దాంతో కమర్షియల్ లెక్కల్లో దానికి దారుణమైన డిజాస్టర్ తప్పలేదు. ఇటీవలే వచ్చిన అక్షయ్ కుమార్ సెల్ఫీ అంత కన్నా దారుణంగా పెర్ఫార్మ్ చేయడం పఠాన్ కు కలిసొచ్చింది 

ఈ ఫిగర్ల సంగతి అలా ఉంచితే బాహుబలిని దాటామనో లేదా ఆర్ఆర్ఆర్ ని కిందికి నెట్టేశామనో సంబరపడటానికి లేదు. ఎందుకంటే పఠాన్ ఎంత గొప్పగా ఆడినా అది అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకున్న గుర్తింపు శూన్యం. ఓటిటిలో వచ్చాక రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తినట్టు సిద్దార్థ్ ఆనంద్ ని కనీసం బాగుందని మెచ్చుకున్నా గొప్పే. అలా జరిగే ఛాన్స్ అయితే లేదు. ఇప్పటిదాకా బాహుబలి 2 పేరు మీదే రికార్డులు ఉన్నాయని తెగ ఉడుక్కున్న ముంబై క్రిటిక్స్ అనలిస్టులు ఇప్పుడు మహా మురిసిపోతున్నారు. అయినా సౌత్ నుంచి సరైన మూవీ వస్తే ఈ పఠాన్ రికార్డులు లేపేయడం ఎంత సేపు