పది అవతారాల్లో సూర్య

ఒక సినిమాలో హీరో పలు అవతారాల్లో కనిపించడం ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. సీనియర్ హీరోల్లో కమల్ హాసన్‌కు ఈ రకమైన మోజు కొంచెం ఎక్కువే. ‘దశావతారం’ సహా పలు చిత్రాల్లో ఆయన రకరకాల అవతారాల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు.

ఆయన తర్వాత విక్రమ్ కూడా ఈ తరహా సినిమాలు చేశాడు. ‘అపరిచితుడు’ మొదలుకుని..గత ఏడాది వచ్చిన ‘కోబ్రా’ వరకు విక్రమ్ పలు చిత్రాల్లో ఈ వేషాలు మార్చే పాత్రలు చేశాడు. కానీ ఒకప్పుడు ఈ తరహా పాత్రలు.. సినిమాలకు మంచి ఆదరణ ఉండేది కానీ.. తర్వాత తర్వాత మొహం మొత్తేయడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పలేదు. గత ఏడాది ‘కోబ్రా’ చిత్రానికి వచ్చిన రిజల్ట్ చూశాక మళ్లీ ఇంకో హీరో ఇలాంటి సాహసం చేయడానికి ఆలోచిస్తాడనడంలో సందేహం లేదు. అయినా సరే.. సూర్య రిస్క్‌కు రెడీ అయినట్లు సమయాచారం.

సూర్య ప్రస్తుతం.. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అజిత్‌తో వరుసగా నాలుగు చిత్రాలు (వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం) తీసిన శివ.. ఆ తర్వాత రజినీకాంత్‌తో ‘అన్నాత్తె’ చేశాడు. అది సరిగా ఆడకపోయినా సూర్య శివను నమ్మి ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో సూర్య యోధుడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు అందాయి. కాగా ఇందులో అతను ఏకంగా పది రకాల గెటప్పుల్లో కనిపిస్తాడట. ఒక పీరియాడిక్ మూవీలో ఒక హీరో ఇన్ని అవతారాల్లో కనిపించడం ఇప్పటిదాకా జరగలేదు. మరి సూర్య, శివ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో చూడొచ్చంటున్నారు. మన దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధ:లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.