అప్పుడెప్పుడో శివ అనే సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ తరువాత సత్య, రంగీళా, సర్కార్ వంటి సినిమాలతో యావత్ ఇండియాను తనవైపు చూసేలా చేసుకున్నాడు. కాని ఒకటే టైపు కంటెంట్ కు అలవాటు పడిపోవడంతో, మాఫియా సినిమాలనో దెయ్యం కథలనో మళ్ళీ మళ్ళీ చెబుతుండటంతో.. మనోడ్ని అక్కడ పెద్ద స్టార్లే కాదు చిన్న హీరోలు కూడా పక్కనెట్టేశారు. దానితో టాలీవుడ్ కు మకాం మార్చాడు వర్మ.
అయితే వర్మ రక్తచరిత్ర సినిమా తీస్తున్నప్పుడు.. అతగాడికి చాలా అప్పులు ఉన్నాయని, అందుకే ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్నాడని ఒక రూమర్ నడిచింది. కాని తరువాత ఐస్ క్రీం వంటి చోటామోటా సినిమాలు తీస్తున్నప్పుడు కూడా.. అప్పులు తీర్చడానికే ఇలాంటి సినిమాలు చేస్తున్నాడని.. నాలుగైదు లక్షల్లో సినిమాలు చేసేసి వాటిని ఒక కోటికి అమ్మితే ఆయనకు నాలుగు రాళ్ళు వెనకేసుకుని పాత బాకీలు తీర్చుకునే అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు చెప్పేవారు.
అసలు వర్మకు అన్నేసి అప్పులు ఎందుకయ్యాయ్, లేకపోతే ఇదంతా ఒక డ్రామానా అనేది తెలియదు కాని, ఇప్పటికి కూడా వర్మ తీసే పులిహోర సినిమాలకు ఆయన సన్నిహితులు చెప్పే రీజన్ ఏంటంటే.. ‘అప్పులు సార్’.
నేకెడ్, క్లయ్ మ్యాక్స్, పవర్ స్టార్, మర్డర్.. ఇలా వరుసపెట్టి కొన్ని షార్ట్ ఫిలింస్ తీస్తున్నాడీ దర్శకుడు. యుట్యూబ్ లో ఉండే పరమచెత్త తెలుగు షార్ట్ ఫిలింస్ కూడా ఈయన తీసిన సినిమాల ముందు క్లాసిక్ సినిమాల్లా కనిపిస్తున్నాయంటే.. వర్మ ఏ రేంజ్ కంటెంట్ జనాలకు అంటగడుతున్నాడో చూసుకోండి. దయ చేసి ఆయన అప్పులన్నీ తీరిపోతే మాత్రం ఇలాంటి సినిమాలను తీయడం ఆయనతో మాన్పించండి బాబోయ్ అంటూ ఆయన సన్నిహితులను ఇప్పుడు వర్మ అభిమానులే కోరుకుంటున్నారు. అది సంగతి.