కళ్యాణ్ రామ్ లెక్క ఎక్కడ మిస్సయ్యింది

గత ఏడాది బింబిసార బ్లాక్ బస్టర్ అయిన ఆనందం కళ్యాణ్ రామ్ కు అమిగోస్ రూపంలో ఆవిరైపోయింది. మొదటిసారి మూడు పాత్రలు అందులోనూ ఒకటి విలన్ గా చేసినప్పటికీ ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. మైత్రి పైకేమో హ్యాట్రిక్ కొట్టామని చెబుతున్నారు వాస్తవికంగా వసూళ్ల కోణంలో చూస్తే మాత్రం ఇది డిజాస్టర్ వైపే పరుగులు పెడుతోంది. సోమవారం నుంచి కలెక్షన్లు మరీ తీసికట్టుగా పడిపోయాయి. వీకెండ్ వరకు అయిదు కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ యాక్షన్ మూవీ ఇంకా ఏడు కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యంలానే కనిపిస్తోంది.

ఒకరకంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ కు ఎంత ప్రయోగాల మీద మక్కువ ఉన్నా తనను చేరువ చేసేది మాస్ ప్రేక్షకులేనని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే అమిగోస్ అనే ఇంగ్లీష్ టైటిల్ జనంలోకి వెళ్లలేకపోయింది. దానికి తోడు కథ మొత్తం విలన్ కోణంలోనే సాగడంతో సాధారణ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఏదో జై లవకుశని ఇంకో వెర్షన్ లో ట్రై చేసినట్టు ఉంది తప్ప నిజానికి ట్రిపుల్ యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరు విలన్ గా ఉండాలన్న రూల్ ఏమి లేదు. ఆ మాటకొస్తే ముగ్గురు మొనగాళ్లు, అధినాయకుడు లాంటి వాటిలో అన్నీ పాజిటివ్ పాత్రలే ఉంటాయి.

కళ్యాణ్ రామ్ తర్వాతి సినిమా డెవిల్. ఇది కూడా ఇంగ్లీష్ పేరే. స్వతంత్ర పోరాట నేపథ్యంలో గూఢచారిగా పని చేసిన ఓ సాహసవంతుడి కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి కొత్తగా అనిపించే అవకాశం లేకపోలేదు. అయితే ఒక హిట్టు పడటం ఆలస్యం ఒకటి రెండు ఫ్లాపులు పలకరించడం కళ్యాణ్ రామ్ కో సెంటిమెంట్ గా మారిపోయింది. అమిగోస్ అది మళ్ళీ నిరూపించింది. సో డెవిల్ హిట్ కావడం అవసరం. కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ రాబోయే సమ్మర్ లేదా దసరా విడుదల లక్ష్యంగా షూటింగ్ చేస్తున్నారు.