సునీల్ వెంటపడుతున్న కోలీవుడ్

ఒకప్పుడు కమెడియన్ గా సునీల్ డిమాండ్ మాములుగా ఉండేది కాదు. బ్రహ్మానందం భీభత్సమైన ఫామ్ లో ఉన్నప్పుడు సైతం తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించడంలో ఈ హాస్య నటుడు ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. హీరోగా అందాల రాముడు ఇచ్చిన విజయం, రాజమౌళి అంతటివాడు మర్యాదరామన్నగా చూపిస్తే జనం ఆదరించిన తీరు తన కెరీర్ ప్లానింగ్ ని పూర్తిగా మార్చేశాయి. క్యారెక్టర్ వేషాలకు స్వస్తి చెప్పేసి పూర్తి కథానాయకుడిగా మారిపోయాడు. తర్వాత పూల రంగడులాంటి ఒకటి రెండు హిట్లు తప్పించి చెప్పుకోదగ్గ బ్రేకులు రాలేదు. దాంతో కొంత గ్యాప్ తీసుకుని తిరిగి రెగ్యులర్ వేషాలకు వచ్చేశాడు.

అరవింద సమేత వీర రాఘవ, కలర్ ఫోటోలు గట్రా బాగానే పేరు తెచ్చినప్పటికీ పుష్పలో చేసిన విలన్ పాత్ర సునీల్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఒకనాటి బిజీ ఆర్టిస్టుగా మార్చేసింది. ముఖ్యంగా కోలీవుడ్ నుంచి సునీల్ కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో చాలా కీలకమైన భాగంలో కనిపించబోతున్నాడు. కార్తీ జపాన్ లో హీరోతో పాటు ప్రయాణం చేసే వాడిగా మంచి పేరు వస్తుందని ఇన్ సైడ్ టాక్. విశాల్ మార్క్ ఆంటోనీలో ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారట. శివ కార్తికేయన్ హై బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ మావీరన్ లోనూ సునీల్ కు ఛాన్స్ దక్కింది.

నిజానికి తెలుగులో కంటే తమిళంలోనే సునీల్ కు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. తనకూ ఒక మార్పులా ఉంటుందని నో అనకుండా ఒప్పేసుకుంటున్నాడు. వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వచ్చిన గ్యాప్ ని ఈ విధంగా పూడ్చుకునే ప్లానింగ్ బాగుంది. పైన చెప్పినవాటిలో ఏ రెండు హిట్ అయినా అరవ సినిమాల్లోనూ జెండా పాతేయొచ్చు. మనకు హాస్య నటుడిగా ఎక్కువ పరిచయం కానీ అక్కడి వాళ్లకు మాత్రం పుష్పలో మంగళం శీనుకి బాగా రిజిస్టర్ అయిపోయాడు. అన్నట్టు దీని రెండో భాగంలో అనసూయ గొంతు కోశాక జరిగే కథలో సునీల్ కి పెద్ద లెన్త్ ఇచ్చాడట దర్శకుడు సుకుమార్.