మనోళ్లు కోలీవుడ్లో కొట్టేశారండోయ్..


ఈ సంక్రాంతికి షెడ్యూల్ అయిన తెలుగు సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో సమానంగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది తమిళ అనువాద చిత్రం ‘వారసుడు’. ఈ చిత్రాన్ని నిర్మించింది టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయితే.. దీన్ని రూపొందించింది తెలుగు స్టార్ డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి. ఈ కథను మహేష్ బాబును దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేయగా, ఆయన రిజెక్ట్ చేయడంతో తమిళ స్టార్ విజయ్‌ను సంప్రదించడం, అతను ఓకే చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కింది.

ఐతే ఇటీవల రిలీజైన ట్రైలర్ చూసి సినిమా సక్సెస్ మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. చాలా తెలుగు సినిమాలను కలిపి ఈ చిత్రాన్ని రూపొందించాడని వంశీ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఐతే మనవాళ్లకు ఆ ట్రైలర్ తేడాగా అనిపించి ఉండొచ్చు కానీ.. తమిళంలో ఈ సినిమా వర్కవుట్ కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు విడుదలైన ‘వారిసు’ ఆ అంచనాలను అందుకున్నట్లే కనిపిస్తోంది.

‘వారిసు’ సినిమాకు తమిళనాట మార్నింగ్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్లో చూపించినట్లే కథ ప్రెడిక్టబుల్‌గానే అనిపించినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోవడం.. కథనం ఎంగేజింగ్‌గా అనిపించడం.. విజయ్ నుంచి అభిమానులు ఆశించే ఎలివేషన్లు, హీరోయిజం.. డ్యాన్సులు, ఫైట్లకు లోటు లేకపోవడంతో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాతో బాగానే కనెక్టవుతున్నట్లున్నారు. సినిమాకు సమీక్షలన్నీ పాజిటివ్‌గా వచ్చాయి. అలాగే మౌత్ టాక్ కూడా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగా ఆదిస్తారని అంటున్నారు. ఓపెనింగ్స్ వరకు ‘వారిసు’ కుమ్మేసేలా కనిపిస్తోంది.

దీనికి పోటీగా రిలీజైన ‘తునివు’ డివైడ్ టాక్‌తో మొదలైంది. దాంతో పోలిస్తే ‘వారిసు’ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం కలిసొచ్చే విషయం. విజయ్ ఇమేజ్‌కు తగ్గట్లు సినిమాను బాగా డీల్ చేశాడని వంశీ పైడిపల్లిని ఫ్యాన్స్ పొగుడుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో రాజుకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. మొత్తంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌లో తెలుగోళ్ల జెండా ఎగిరినట్లే కనిపిస్తోంది.