ఒక్క దర్శకుడు.. ఎన్ని సినిమాలో?

మల్లిడి వేణు అలియాస్ వశిష్ట్.. గత ఐదారు నెలల నుంచి టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన పేరిది. దర్శకుడిగా తన తొలి చిత్రం ‘బింబిసార’తో అతను సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఇండస్ట్రీలో. కళ్యాణ్ రామ్ అనే సక్సెస్‌లో లేని హీరోను పెట్టి పెద్ద బడ్జెట్లో అతను తీసిన ఈ సోషియో ఫాంటసీ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ ‌బస్టర్‌గా నిలిచింది. తొలి సినిమాకు కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకుని ఎంతో జనరంజకంగా దాన్ని తీర్చిదిద్దిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఇండస్ట్రీలో వశిష్ఠ్‌కు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది.

ఆల్రెడీ ‘బింబిసార-2’ పనుల్లో ఉన్న అతడితో సినిమా చేయడానికి చాలామంది హీరోలు, నిర్మాతలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అతను ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేయడానికి ప్రయత్నం చేయడం చర్చనీయాంశం అయింది. ఇదేమీ రూమర్ కూడా కాదు. నిజంగానే రజినీని కలిసి వశిష్ఠ్ ఒక కథను నరేట్ చేశాడు. రజినీ కూడా సానుకూలంగానే స్పందించాడు కానీ.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో మాత్రం తెలియదు.

మరోవైపు వశిష్ఠ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు శిరీష్ హీరోగా కొన్నేళ్ల ముందు ఒక సినిమాకు రంగం సిద్ధం చేసి.. ఆ తర్వాత బడ్జెట్ వ్యవహారాల్లో తేడా వచ్చి వెనక్కి తగ్గిన గీతా ఆర్ట్స్ సంస్థ.. ఇప్పుడు ఈ యువ దర్శకుడితో ఒక సినిమా చేయడానికి అతడి నుంచి కమిట్మెంట్ తీసుకుంది. అందులో హీరోగా శిరీషే నటిస్తాడా.. ఇంకెవరైనా చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు.

కాగా వశిష్ట్.. నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. నందమూరి ఫ్యామిలీలో ఒక హీరోతో చేసిన దర్శకుడు.. ఆ తర్వాత అదే కుటుంబంలో మరో హీరోతో జట్టు కట్టడం కొత్తేమీ కాదు. కళ్యాణ్‌ రామ్‌తో క్లోజ్‌గా ఉండే బాలయ్యకు.. ‘బింబిసార’తో అంత మెప్పించిన దర్శకుడితో సినిమా చేయడానికి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఈ సీనియర్ హీరోకు వశిష్ఠ్ ఒక లైన్ చెప్పాడని.. ఆయనకు నచ్చిందని, తనకున్న కమిట్మెంట్లు పూర్తయ్యాక సినిమా చేస్తానని బాలయ్య మాట ఇచ్చినట్లు సమాచారం.