వారసుడు తప్పుకుంటే వీరలకు పండగే

సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. వారసుడుకి ఎక్కువ థియేటర్లు పడటం వల్ల తమ హీరోల ఓపెనింగ్స్ కి గండి పడతాయని భావిస్తున్న చిరంజీవి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త వినపడేలా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం పలు సాంకేతిక కారణాల వల్ల వారసుడు తెలుగు వెర్షన్ వాయిదా పడేలా ఉంది. అనుకున్న డేట్ కన్నా మూడు రోజులు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్ కావొచ్చని వినికిడి. తమిళనాడులో మాత్రం యథావిధిగా 11నే దిగిపోతుంది. తెగింపులో ఎలాంటి మార్పులు ఉండబోవడం లేదు. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఈ రోజు ఇచ్చిన పేపర్ యాడ్స్ లో వారసుడు కమింగ్ థిస్ సంక్రాంతి అని ఇచ్చారే తప్ప ఫలానా డేట్ అని చెప్పలేదు. కానీ తెగింపు నిర్మాతలు మాత్రం స్పష్టంగా తేదీని పేర్కొన్నారు. ఒకవేళ ఇదే నిజమైన పక్షంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకు మొదటి రోజు థియేటర్ల విషయంలో పెద్ద టెన్షన్ తప్పినట్టే. ఎందుకంటే దిల్ రాజు ఎక్కువ స్క్రీన్లను లాక్ చేయడం వల్ల ఫస్ట్ డే వసూళ్లకు గండం పడుతోందని ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ కు ఇది పెద్ద రిలీఫ్ కలిగిస్తుంది. మహా అయితే ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్టులు ఉండకపోతే తప్ప.

ఇక తమిళనాట సీన్ ఇంకోలా ఉంది. 11న బెనిఫిట్ షోలు రాత్రి 1 గంటకు తునివు, తెల్లవారుఝామున 4 గంటలకు వరిసులకు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని థియేటర్లు ఉంటే అన్నింటిలోనూ వేయబోతున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ ఆటలను సమానంగా పంచుతారు. ఏరియాలను బట్టి కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కానీ ఫైనల్ కౌంట్ అయితే ఒకేలా ఉండొచ్చని టాక్. ఇప్పటిదాకా నిందలను భరిస్తూ వాటికి కౌంటర్లు ఇస్తూ అన్నీ భరిస్తూ వచ్చిన దిల్ రాజు ఇప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వారసుడు మారతాడా లేక ముందు మాటకు కట్టుబడతాడా చూద్దాం.