మరాఠి మజిలీని ఎగబడి చూస్తున్నారు

అక్కినేని ఫ్యాన్స్ కి మజిలీతో మంచి కనెక్షన్ ఉంది. నాగ చైతన్య కెరీర్ పెద్ద గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాలో తనతో సమంతా బాండింగ్ ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద పండిందో అభిమానులు మర్చిపోలేరు. వాళ్లిప్పుడు విడిపోయినా ఈ మూవీ రూపంలో ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి. ఐదేళ్ల తర్వాత దీని మరాఠి రీమేక్ వేద్ పేరుతో మొన్న డిసెంబర్ 30న రిలీజయ్యింది. సామ్ పాత్రను బొమ్మరిల్లు హాసిని జెనీలియా పోషించగా ఆమె నిజ జీవిత భర్త రితీష్ దేశముఖ్ చైతు క్యారెక్టర్ చేయడం కాకతాళీయంగా జరిగిందో లేక ముందే ప్లాన్ చేసుకున్నారో ఆ టీమ్ కు మాత్రమే తెలిసిన రహస్యం.

దీనికి దర్శకుడు కూడా రితిషే. తొలుత ఆన్ లైన్లో ఈ వేద్ పాటలు ట్రోలింగ్ కి గురయ్యాయి. ఒరిజినల్ ని చెడగొట్టారనే కామెంట్స్ వచ్చాయి. కానీ అనూహ్యంగా ఇది బ్లాక్ బస్టర్ దిశగా సాగడం ట్విస్టు. మొదటి వీకెండ్ కే 10 కోట్ల గ్రాస్ ని దాటడం చూసి ట్రేడ్ నివ్వెరపోతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా మూడు రోజులకే ఇంత వసూలు చేసిన మొదటి మరాఠి సినిమా ఇదే. బాక్సాఫీస్ రన్ ఇంకా స్టడీగానే ఉంది. హిందీ డబ్బింగ్ చేయకపోయినా ముంబై ఢిల్లీ కోల్కతా లాంటి నగరాల్లో మంచి కలెక్షన్లు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోనూ కొన్ని షోలు రన్ అవుతున్నాయి.

దీన్ని బట్టే మజిలీలో కంటెంట్ బలం ఏంటో అర్థం చేసుకోవచ్చు. శివ నిర్వాణ ఆవిష్కరించిన ఈ ఎమోషనల్ జర్నీకి ఇతర భాషల్లోనూ సక్సెస్ కావడం కన్నా చైతు అభిమానులు హ్యాపీగా ఫీలయ్యేది ఏముంటుంది. దీని దెబ్బకు జెనీలియా తన సెకండ్ ఇన్నింగ్స్ సీరియస్ గా తీసుకుంటుందట. హీరోయిన్ గా మరాఠిలోనే మంచి అవకాశాలు వస్తుండటంతో దానికి తగ్గట్టే ప్లానింగ్ లో ఉంది. పెళ్లి చేసుకుని పిల్లలయ్యాక ఇలాంటి విజయాలు దక్కడం చాలా అరుదు. అందులోనూ భర్తతో కలిసి సూపర్ హిట్ ని షేర్ చేసుకోవడం కన్నా బెస్ట్ మూమెంట్ వేరే ఉంటుందా. జెనీలియా అదే ఎంజాయ్ చేస్తోంది.