సినిమాల బడ్జెట్, వసూళ్లు, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇలా ఏ విషయంలో చూసినా నందమూరి బాలకృష్ణ కంటే మెగాస్టార్ చిరంజీవి కొన్ని మెట్లు పైనే ఉంటాడు. బాలయ్య కెరీర్లో కూడా కొన్ని ఆల్ టైం హిట్లు ఉండొచ్చు. కొన్నిసార్లు చిరును ఢీకొట్టి పైచేయి సాధించి ఉండొచ్చు.. అయినా సరే.. ఈ ఇద్దరిలో ఓవరాల్ ఆధిపత్యం మాత్రం చిరుదే.
2001లో మృగరాజుకు బ్యాడ్ టాక్ రావడం వల్ల నరసింహనాయుడు పైచేయి సాధించి ఉండొచ్చు కానీ.. 2017లో మాత్రం అలా జరగలేదు. ఎక్కువ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బాలయ్య సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ని మించి చిరు మూవీ ‘ఖైదీ నంబర్ 150’దే ఆధిపత్యం అయింది. మరి ఈ సంక్రాంతికి రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’తోనూ చిరు.. బాలయ్య మూవీ ‘వీరసింహారెడ్డి’ని అధిగమిస్తాడా అని అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈసారి ఓవరాల్ బజ్ చిరు సినిమాకే ఎక్కువ కనిపిస్తోంది.
కానీ ఈ ప్రభావం యుఎస్ మార్కెట్లో అయితే ప్రతిఫలించడం లేదు. చిరు సినిమా కంటే బాలయ్య మూవీకే అక్కడ ఎక్కువ స్పందన కనిపిస్తోంది. శుక్రవారం ఉదయానికి ప్రి సేల్స్ చూస్తే ఈ సంగతి అర్థమవుతోంది. యుఎస్‌లో ‘వీరసింహారెడ్డి’ 61 లొకేషన్లలో 132 ప్రిమియర్ షోలు వేస్తుండగా.. ఇప్పటిదాకా ప్రి సేల్స్‌తో 40 వేల డాలర్లు వసూలయ్యాయి.
అమ్ముడైన టికెట్ల సంఖ్య 2264. ఐతే అదే సమయానికి చిరు సినిమాకు ప్రి సేల్స్ ద్వారా 27 వేల డాలర్లే వచ్చాయి. ఆ సినిమా టికెట్లు 1483 అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి 54 లొకేషన్లలో 114 ప్రిమియర్ షోలు పడుతున్నాయి.
చిరు, బాలయ్య సినిమాల మధ్య లొకేషన్లు, షోలు, ప్రి సేల్స్‌లో ఈ అంతరం ఆశ్చర్యం కలిగించేదే. ఐతే ఈ మధ్య టీడీపీ కేడర్, కమ్మ కమ్యూనిటీ మంచి ఉత్సాహంతో ఉన్నాయి యుఎస్‌లో. ‘చెన్నకేశవరెడ్డి’ రీరిలీజ్ టైంలో కూడా మంచి ఊపు చూపించారు. అదే ఉత్సాహాన్ని బాలయ్య కొత్త సినిమాకు కూడా చూపిస్తున్నారనే చర్చ నడుస్తోంది.