టాలీవుడ్ కు మరో విషాదం.. నటుడు చలపతిరావు ఇక లేరు
టాలీవుడ్ కు మరో షాకింగ్ న్యూస్. ఇటీవల కాలంలో వరుస పెట్టి చోటు చేసుకుంటున్న మరణాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజుల క్రితం దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ కాలం చేసిన విషాదం ఇంకా వదిలి వెళ్లక ముందే మరో అనూహ్య విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు.. విలన్ గా.. విలువలు ఉన్న వ్యక్తిగా వెండితెర మీద జీవించిన సీనియర్ నటుడు చలపతిరావు. ఆయన ఈ రోజు (ఆదివారం) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న ఆయన అనూహ్యంగా కాలం చెందటం షాకింగ్ గా మారింది. 78 ఏళ్ల వయసున్న చలపతిరావుకు ఎంతో కాలం మునుపే సతీమణి కాలం చేశారు.
ఇటీవల కాలంలో ఆయనకు అనారోగ్య సమస్యలు ఎక్కువ కావటంతో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చలపతి రావుకు ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దర్శకుడిగా తనదైన ముద్రను వేసిన రవిబాబు చలపతిరావు కుమారుడే అన్న విషయం తెలిసిందే. వెండితెర మీద చలపతి రావు విలనిజం కొంతకాలం పాటు.. నిజ జీవితంలోనూ ఆయన్ను చూసినంతనే వణికిపోయే పరిస్థితి ఉండేది.
భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించే చలపతిరావు తర్వాతి కాలంలో సాత్విక పాత్రలు వేయటం తెలిసిందే. ఆ మార్పు ఆయన్ను గా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. వందలాది సినిమాల్లో నటించిన చలపతిరావు వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది.
హైదరాబాద్ లోని తన సొంతింట్లో ఆదివారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మరో సీనియర్ నటుడు కాలం చేయటం టాలీవుడ్ కే కాదు.. తెలుగు ప్రేక్షకులకు విషాదంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates