కొన్నేళ్ల ముందు బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ఊపు చూసి ఖాన్ త్రయం కూడా కంగారు పడే పరిస్థితి ఉండేది. మిగతా స్టార్ల లాగా ఒక్కో సినిమాకు ఏడాది రెండేళ్లు తీసుకోకుండా.. ఏడాదికి మూణ్నాలుగు సినిమాలు లాగించేసేవాడతను. అలా అని క్వాలిటీకి కూడా ఢోకా ఉండేది కాదు. ఒకట్రెండు సినిమాలు తేడా కొట్టినా ఇంకో రెండు సినిమాలు ఆడేసేవి. బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా మినిమం గ్యారెంటీ అన్నట్లుండేది. తక్కువ బడ్జెట్లో చేయడం వల్ల అక్షయ్ సినిమాలు ప్రాఫిట్ జోన్లో ఉండేవి. ఇలా తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల బాలీవుడ్లో ఖాన్ త్రయాన్ని వెనక్కి నెట్టి ఏడాదిలో అత్యధిక పారితోషకం అందుకునే హీరోగా ఎదిగిపోయాడు అక్షయ్.
ఐతే మంచి సినిమాలు పడుతున్నపుడు, బాక్సాఫీస్ సక్సెస్‌లు వస్తున్నపుడు అక్షయ్ పరిస్థితి బాగానే ఉంది కానీ.. కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది.
కంటెంట్‌తో సంబంధం లేకుండా అక్షయ్ సినిమాలు వరుసగా బోల్తా కొట్టేస్తున్నాయి. ఈ ఏడాది బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నాడతను. ఓటీటీలో రిలీజైన కట్ పుట్లి సైతం బోల్తా కొట్టేసింది. దీంతో స్వయంగా అక్షయ్ అభిమానులే ఇక సినిమాలు మానేయ్ అంటూ ట్రెడ్ చేసే పరిస్థితి వచ్చింది. ఫలితంగా చాలా జాగ్రత్తగా తర్వతి సినిమాలు చేయాల్సిన స్థితికి చేరుకున్నాడతను.
ఐతే ఇలాంటి టైంలో అక్షయ్ ఒక భారీ, రిస్కీ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఆ చిత్రమే.. వేదత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్. ఇది మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడం విశేషం. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ రూపొందిస్తున్నాడు. హిందీ, మరాఠీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా విడుదల కానుందట. ఈ మధ్య చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు బాగా ఆడుతుండడంతో అక్షయ్ ఈ ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు. మరి ఈ సినిమాతో అయినా హిట్టు కోసం అతడి నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.