ఒకపక్క డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మన తెలుగు స్ట్రెయిట్ చిత్రాలకు ఎక్కువ థియేటర్లు వచ్చేలా చూడాలని సాక్ష్యాత్తు ఫిలిం ఛాంబరే కోరితే అల్లు అరవింద్ మాత్రం అదెవరూ ఆపలేరని, కంటెంట్ ఉంటే అవే ఆడతాయని లేదంటే పోతాయని చెప్పడం పెద్ద చర్చకే దారి తీస్తోంది. వచ్చే వారం ఆయనే సమర్పిస్తున్న బాలీవుడ్ డబ్బింగ్ తోడేలు విడుదల ఉంది కాబట్టి ఈ కామెంట్స్ చేశారన్న వాదనలో నిజం లేకపోలేదు. పైకి సులువుగా అనేశారు కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం బోలెడు ప్రశ్నలు సంధిస్తున్నారు. అందులో ఆలోచించదగ్గ పాయింట్లు ఉన్నాయి.
తెలుగు డబ్బింగులకు తమిళనాడులో ఏనాడూ రెడ్ కార్పెట్ దక్కలేదు. ఒక్క బాహుబలి మాత్రమే దానికి మినహాయింపుగా నిలిచింది. రజనీకాంత్, అజిత్, విజయ్ లాంటి పెద్ద హీరోల రిలీజులు ఉన్నప్పుడు ఒకవేళ మన స్టార్ల సినిమాలు అక్కడ రిలీజ్ చేస్తాము స్క్రీన్లు ఇవ్వమంటే డిస్ట్రిబ్యూటర్లు ససేమిరా అంటారు. ఎందుకంటే వాళ్లకు ప్రాంతీయాభిమానం ఎక్కువ. కానీ మనం అలా కాదు. ఒకప్పుడు విక్రమ్ శంకర్ ల సినిమా వచ్చినా ఎందుకొచ్చిన క్లాష్ అని దారి వదిలిన సందర్భాలు ఎన్నో. వాళ్ళకు లేని టాలీవుడ్ ప్రేమ మనవాళ్లకు మాత్రం ఎందుకు అనే క్వశ్చన్ కి బదులు ఏది.
అంత చులకనగా మన స్టార్లను ట్రీట్ చేస్తున్నప్పుడు ఏదో ఇక్కడ వందల కోట్ల మార్కెట్ ఉందనే రేంజ్ లో విజయ్ వారసుడుకి ఇంతేసి స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఏంటనేది చిరంజీవి బాలకృష్ణ అభిమానులు మూకుమ్మడిగా ప్రశ్నిస్తున్నారు. అప్పుడెప్పుడో పేటకి థియేటర్లివ్వమని తేల్చేసినప్పుడు అదే ట్రీట్మెంట్ ఇప్పుడు వరిసు కూడా దక్కాలి కదా. మరి దిల్ రాజు ఉన్నందు వల్లే ఎవరూ నోరు మెదపడం లేదనుకోవాలా. అల్లు అరవింద్ సైతం నేనే వస్తున్నా, కాంతార రూపంలో తక్కువ గ్యాప్ లో రెండు డబ్బింగులు విడుదల చేశారు. దిల్ రాజు పొన్నియన్ సెల్వన్ 1 గ్రాండ్ రిలీజ్ ఇప్పించారు. అరవింద్ గారి సమర్ధింపులో మిస్సవుతోంది ఈ తర్కమే.