శివరాత్రిని సంక్రాంతి చేసేలా ఉన్నారు

టాలీవుడ్ కొత్త రిలీజులకు డేట్ సెట్ చేసుకోవడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. మనం ప్రకటించినంత మాత్రాన తాపీగా ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎవరు ఏ అనౌన్స్ మెంట్ ఇస్తారో ఎవరితో క్లాష్ అవ్వాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూడాల్సి వస్తోంది. అందుకే ఏదైనా పండగ వచ్చినా ఏదైనా వరస సెలవులు కనిపిస్తున్నా వెంటనే కర్చీఫ్ వేసేందుకు పరుగులు పెడుతున్నారు. మాములుగా నాలుగైదు సినిమాలు పోటీ పడేందుకు మనకు అనుకూలమైన పండగలు మూడే. అవి సంక్రాంతి, దసరా, దీపావళి. ఇప్పుడీ లిస్టులో శివరాత్రి కూడా తోడవ్వబోతోంది.

ఇంకా మూడు నెలల సమయం ఉండగానే ఫిబ్రవరి స్లాట్ లను వేగంగా రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన వాటిలో ముందు లాక్ చేసుకున్నది కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. 17న రాబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించారు నిన్న ధనుష్ ‘సర్’ని అదే డేట్ కి థియేటర్లలో రిలీజ్ చేస్తామని సితార సంస్థ పోస్టర్ వదిలింది. ఒకటేమో గీతా ఆర్ట్స్ మరొకటేమో సితార ఎంటర్ టైన్మెంట్స్. రెండూ పెద్ద బ్యానర్లే. జనవరి నుంచి ‘ఏజెంట్’ తప్పుకోవడం దాదాపు కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు తన చూపు కూడా శివయ్య జాగారం మీదే పడుతోంది. ఆల్మోస్ట్ ఓకే అవ్వొచ్చని అంటున్నారు.

వీటికి వారం ముందు ఫిబ్రవరి 10న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఉంటుంది. మాస్ ఆడియన్స్ అర్థం కానీ ఇంగ్లీష్ టైటిల్ తో నందమూరి హీరో ఏకంగా త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు ఇప్పటికే లీక్ వచ్చేసింది. సినిమా బాగుంటే సెకండ్ వీక్ కూడా స్ట్రాంగ్ రన్ ఉంటుంది. సో పోటీ మాములుగా ఉండదు. ఇవి చాలదన్నట్టు హాలీవుడ్ మూవీ ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ ఖ్వన్టమేనియా’ కూడా 17నే వస్తుంది. సమంతా కనక త్వరగా కోలుకుంటే ‘శాకుంతలం’ని సైతం ఇదే బరిలో దించేందుకు దర్శక నిర్మాత గుణశేఖర్ ప్లానింగ్ లో ఉన్నారు. చివరికి రేస్ లో ఎవరుంటారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.