ఇప్పుడు టాలీవుడ్లో తమన్ హవా మామూలుగా లేదు. వరుసగా భారీ చిత్రాలను దక్కించుకుంటూ ప్రతి ఆడియోనూ బ్లాక్ బస్టర్ చేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అతడి సినిమా ‘అల వైకుంఠపురములో’ ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇటీవలే ఆ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట 25 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ సినిమాలోని పాటలతో తమన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’కు సంగీతాన్నందించే అవకాశం దక్కించుకున్నాడు తమన్.
త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ సినిమా సహా మరిన్ని పెద్ద ప్రాజెక్టులు అతడి చేతికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్‌ను పక్కన పెడితే తమిళంలోనూ ఇప్పటికే తమన్ పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. కన్నడలోనూ కొన్ని భారీ చిత్రాలకు పని చేశాడు. ఇక దక్షిణాదిన మిగిలింది మలయాళ సినీ పరిశ్రమ మాత్రమే.
తెలుగు నటీనటులు, టెక్నీషియన్లు మలయాళ సినిమాల్లో పని చేయడం చాలా అరుదు. అక్కడి సినిమాలకు కోలీవుడ్‌తో కనెక్షన్ ఉంటుంది కానీ.. టాలీవుడ్ వైపు చూడరు. మన దగ్గర అగ్ర శ్రేణి సంగీత దర్శకులు ఎవరూ మలయాళం సినిమాలకు నేరుగా పని చేసింది లేదు. కీరవాణి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్.. వీళ్లెవ్వరూ కూడా డైరెక్ట్ మలయాళం సినిమా చేసింది లేదు. కానీ తమన్ మాత్రం అక్కడ ఛాన్స్ పట్టేశాడు.
మలయాళ సూపర్ స్టార్లలో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమార్ హీరోగా సీనియర్ దర్శకుడు షాజీ కైలాస్ రూపొందించనున్న ‘కడువ’ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఒకప్పుడు మలయాళంలో బ్లాక్‌బస్టర్ మూవీస్ తీశాడు షాజీ. ఆయన్ని టాలీవుడ్‌కు తీసుకొచ్చి ‘విష్ణు’ సినిమా తీయించాడు మోహన్ బాబు. అది ఆడలేదు కానీ.. మలయాళంలో మాత్రం ఆయనకు మంచి పేరుంది. కొంచెం గ్యాప్ తర్వాత షాజీ తీస్తున్న సినిమాకు తమన్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకోవడం విశేషమే. మరి అక్కడ తమన్ ఎలా మోత మోగిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates