బుకింగ్స్ శూన్యం – టాకే శరణ్యం

ఎల్లుండి చెప్పుకోవడానికి స్ట్రెయిట్ అండ్ డబ్బింగ్ కలిపి మొత్తం పది సినిమాలు రిలీజవుతున్న మాటే కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం దారుణంగా ఉన్న మాట వాస్తవం. అంతో ఇంతో పేరున్న బ్యానర్లు క్యాస్టింగ్ తో వస్తున్నవి కూడా జనాన్ని మొదటిరోజే చూసే విధంగా ప్రేరేపించలేకపోతున్నాయి. ఆయా యూనిట్లు ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నాయి. మాల్స్ కు వెళ్లి జనాన్ని కలవడం, గ్రాండ్ ఈవెంట్లు చేయడం, నాన్ స్టాప్ మీడియా ఇంటర్వ్యూలు ఇవన్నీ జరిగిపోతున్నాయి ఆశించే ఊపైతే బాక్సాఫీస్ వద్ద కనిపించడం లేదు. అసలు సందడి వాతావరణమే లేదు.

థియేటర్ కంటెంట్ కి డెఫినిషన్ మారిపోయి ఓటిటిలో విస్తృతంగా ఆప్షన్లు పెరుగుతున్న తరుణంలో ఆషామాషీ బొమ్మలకు జనం అంత సులభంగా రావడం లేదు. ఈ శుక్రవారం వస్తున్న వాటిలో సంతోష్ శోభన్, అల్లు శిరీష్ లాంటి గుర్తింపు ఉన్న హీరోల మూవీస్ ఉన్నాయి కానీ ఫస్ట్ డే ఫుల్ చేయించేంత ఫాలోయింగ్ వీళ్లకు లేదు. అబ్బో చాలా బాగుందటగా అనే మాట బయటకి వస్తేగాని పబ్లిక్ హాలు దాకా వచ్చి టికెట్లు కొనడం లేదు. పైగా విజువల్ గ్రాండియర్ నెస్ కి జనం బాగా అలవాటు పడిపోయారు. కాంతారని నెత్తినబెట్టుకున్నారంటే కారణం అందులో మునుపెన్నడూ చూడని రా నేటివిటీనే.

అందుకే టాకే ఇప్పుడు కీలకంగా మారనుంది. ఏదో పర్లేదన్నా సరిపోదు. బ్రేక్ ఈవెన్ చేరుకోలేం. బిజినెస్ అతి తక్కువగా జరిగి ఉంటే ఓకే కానీ లేదంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా నష్టాలు తప్పవు. ముందస్తు టికెట్లు అమ్ముడుపోకపోవడానికి మరో కారణం కూడా ఉంది. అదనంగా ఇరవై ముప్పై రూపాయలు ఖర్చు పెట్టుకునేంత డిమాండ్ వీటికి లేకపోవడంతో సామాన్య ప్రేక్షకులు నేరుగా కౌంటర్లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్లే ఆన్ లైన్ పర్సెన్ టేజ్ తక్కువగా కనిపిస్తుంది. మరి చప్పగా ఉన్న వాతావరణాన్ని కొత్తగా వచ్చే సినిమాల్లో ఏవి వేడెక్కిస్తాయో చూడాలి.