ఆయన ఏ గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు… ఇష్టపడి వచ్చారు.. కష్టం విలువ తెలుసుకున్నారు… అందరి ఆదరాభిమానాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థానంలో వెలుగులు విరజిమ్ముతున్నారు. గాడ్ ఫాదర్ గా మళ్లీ జనం ముందుకు వచ్చారు.. ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందులో ఆయన పోషించిన బ్రహ్మ పాత్రకు ఆబాలగోపాలం ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆభినందించేందుకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం ఆయన ఇంటికి వెళ్లింది. అధ్యక్షకార్యదర్శులు సురేష్ కొండేటి, ఎం. లక్ష్మీనారాయణ, కోశాధికారి హేమసుందర్ పామర్తి, ఉపాధ్యక్షుడు ఆర్డీఎస్ ప్రకాష్, జాయింట్ సెక్రటరీ ఎస్. నారాయణరెడ్డి, ఎక్స్ అఫిషియో సభ్యులు కె. లక్ష్మణ రావు, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ఎ. ప్రభు, కార్యవర్గ సభ్యులు ధీరజ్ అప్పాజీ, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లికార్జున్, రమేష్ చందు, సిహెచ్. నవీన్, రవి గోరంట్ల, బి. శివకుమార్ తదితరులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. గాడ్ ఫాదర్ మెగా విజయం సాధించినందుకు అభినందనలు తెలిపి ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు.
మరోసారి మెగా స్పందన
తనని కలిసిన మీడియా వారితో స్నేహపూర్వకంగా మెలగడంలో తనకు తానే సాటి అని మెగాస్టార్ చిరంజీవి చాటుకున్నారు. మీడియా ప్రతినిధులు ఎప్పుడు కలిసినా వారికి తగినంత సమయం కేటాయించడంలో ఆయనకు ఆయనే సాటి. గతంలో ఆచార్య సినిమా షూటింగులో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం కలిసిన సందర్బంలో వారితో దాదాపు రెండు గంటల సేపు ముచ్చటించారు. ఓ అరగంట మాట్లాడి వెళ్లిపోతున్న మీడియా మిత్రుల్ని చిరంజీవి వారించి దాదాపు రెండు గంటలపాటు వారితో సినిమాలు, ఇతర అంశాలపై ముచ్చటించారు.
జనం మెచ్చే అంశాలవల్లే గాడ్ ఫాదర్ కు అంత విజయం
గాడ్ ఫాదర్ అంత విజయం సాధించడం వెనుక జనానికి నచ్చిన, వారు మెచ్చిన అంశాలెన్నో ఉన్నాయని, కథలో మోహన్ రాజా చేసిన మార్పుల వల్లే ఇది సాధ్యమైందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘సినిమా కథ అనేది అరటిపండు వలిచినట్టుండాలి. ఎక్కడా ఎలాంటి సందిగ్ధతా ఉండకూడదు. సన్నివేశాల పరంగా ఏది ఎప్పుడు రివీల్ చేయాలనేది ముందుగానే అనుకున్నాం. ఫైనల్ కాపీ చూశాక కూడా చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ముందు షూట్ చేసిన క్లైమాక్స్ నాకు నచ్చలేదు. విలన్ అనుకున్న ఇంటర్నేషనల్ డాన్ వచ్చి బ్రహ్మకు సలాం చేయడమేంటి? అని సత్యదేవ్ పాత్ర అవాక్కవుతుంది. నీ భర్త నా ఎదురే ఉన్నాడు ఏం చేయమంటావమ్మా అని నయన తారతో అంటాను. ఈ తాళి ఉండకూడదన్నయ్యా అని ఆమె తెంపేయడం, నేను గన్ తీసుకుని సత్యదేవ్ క్యారెక్టర్ ను కాల్చేయడం ఒక వెర్షన్, అతనే గన్ తీసుకుని తనను తాను కాల్చుకోవడం… లాంటి వెర్షన్లు చేశాం. అప్పటికే అతను జీవచ్ఛవంలా ఉన్నాడు. అలాంటి అతన్ని ఇద్దరు సూపర్ స్టార్స్ చంపడం ఏంటి అనిపించింది. అది నాకస్సలు నచ్చలేదు. ‘ఫినిషింగ్ నచ్చలేదు రాజా’ అన్నాను. వేట సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్ర విషయంలో ఇాలాంటిదే జరిగింది. అతను చాలా లోభి.. క్లైమాక్స్ లో అతని ముందు బంగారు నాణేలు విసిరి తిను తిను అంటాను. అది నాకు చాలా బ్యాడ్ ఎక్స్ పీరియన్స్. అందుకే క్లైమాక్స్ మార్చమని కోరాను. నయన తార కారులో రోడ్డు మీద వస్తుంటే కిల్ హర్ అంటాడు సత్యదేవ్. కానీ అది కూడా జరగదు. తన మామను చంపి నట్టుగానే ఇన్ హేలర్ తో తనకి తానే చంపుకునేలా మోహన్ రాజా చేసిన మార్పు మా అందరికీ బాగా నచ్చింది. త్రీ వీక్స్ బ్యాక్ ఆ షాట్ చేశాం. క్లైమాక్స్ ఇలా మార్చినందుకు వీరందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి. లూసీఫర్ లోని చాలా అంశాల్లో మార్పులు చేయడం వల్లే మన నేటివిటీ తగ్గట్టుగా సినిమా వచ్చిందని చిరంజీవి వివరించారు. తను నటించిన చిత్రాల్లో టాప్ 5లో గాడ్ ఫాదర్ ఉంటుందని అన్నారు.
అలుపెరగని యోధుడు మెగాస్టార్
అలసట లేకుండా శ్రమించడం మెగాస్టార్ లోని ఓ లక్షణం. గాడ్ ఫాదర్ సినిమా విడుదలకు ముందు అక్టోబరు 1న చిరంజీవి మామగారైన అల్లు రామలింగయ్య శత జయంతి జరిగింది. ఈ సందర్భంగా కోకాపేటలోని అల్లూ స్టూడియోస్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ హాజరయ్యారు. అక్కడ ప్రసంగించిన వెంటనే ముంబైలో జరిగే గాడ్ ఫాదర్ ప్రమోషన్ కార్యక్రమానికి హాజరై సాయంత్రం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగి అల్లు రామలింగయ్య మీద రాసిన పుస్తకావిష్కరణ సభకు వచ్చారు. అంతేకాదు ఉత్సాహంతో ఆ సభలో మాట్లాడారు. విశ్రాంతి లేకుండా ఇలా ఎలా సాధ్యమని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మెగాస్టార్ బదులిస్తూ మానసికంగా ఎగ్జయిట్ మెంట్ ఉంటే అలసట అనేది ఉండదు. నాకు షూటింగ్ ఉంటే తెల్లవారు జామున నాలుగున్నరకే లేస్తాను. ఆ రోజు సాయంత్రం జరిగిన సభలో అందరూ చాలా బాగా మాట్లాడారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా బాగా మాట్లాడారు. అందరూ అన్నీ మాట్లాడేశాక.. నేనింకా ఏం మాట్లాడాలి అనుకున్నా. గతంలో చాలా సార్లు మాట్లాడినవి రిపీట్ కాకూడదు. అందుకే ఆరోజు సరదాగా మాట్లాడాను అని వివరించారు. అక్కడే ఉన్న దర్శకుడు బాబి మాట్లాడుతూ రెస్ట్ లెస్ గా తన సినిమా షూటింగులో చిరంజీవిగారు పాల్గొన్న సందర్భాలను గుర్తు చేశారు. తన గురించి వేరే వారు ఇబ్బంది పడటం తనకు ఇష్టముండదని చిరంజీవి అన్నారు. తన ఒక్కడి వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదనే ఉద్ధేశంతో తను అవిశ్రాంతంగా పనిచేస్తానని, తన కెరీర్ మొదట్నుంచీ ఇలాగే చేశానన్నారు. ఆ సమయంలో తనను విశ్రాంతి తీసుకోమని ఎవరైనా అన్నా తనకు విపరీతంగా కోపం వస్తుందన్నారు.
గాడ్ ఫాదర్ తర్వాత బాబి సినిమానే
గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న బాబీ సినిమానే విడుదలవుతుంది. ఈ సినిమాకు పేరు ఇంకా ఖరారు కాలేదు. బాబి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గాడ్ ఫాదర్ విడుదలైన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొంచెం కూడా విశ్రాంతి తీసుకోలేదు. కొత్త చిత్రాల కథలు వినడంతో పాటు బాబి సినిమా షూటింగ్ కోసం డిస్కషన్ లోనూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్యయ్యాకే భోళా శంకర్ విడుదల ఉంటుందని చిరంజీవి చెప్పారు. రెండు సినిమా షూటింగులూ జరుగుతున్నా ముందుగా బాబి సినిమాని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. రెండు గంటల పాటు మెగాస్టార్ తో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం అనేక విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఏ గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వ్యక్తి చిత్ర పరిశ్రమకు కూడా ఎలా గాడ్ ఫాదర్ అయ్యారో ఆయనతో మాట్లాడినవారికెవరికైనా అర్థమవుతుంది. ఈ సక్సెస్ మంత్ర ఒక్క మెగాస్టార్ కు తప్ప ఇంకెవరికీ తెలియదు.
This post was last modified on October 12, 2022 3:24 pm
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…