గెట్ రెడీ.. అదిపురుష్ టీం వ‌స్తోంది


ఈ మధ్య కాలంలో ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ మీద జరిగినంత ట్రోలింగ్ మరే సినిమా విషయంలోనూ జరగలేదేమో. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ తీవ్ర నిరాశకు గురి చేశాక అభిమానుల ఆశలన్నీ ‘ఆదిపురుష్’ మీదే ఉండగా.. దాదాపుగా ఆ ఆశలను టీజర్ నీరుగార్చేసిందనే చెప్పాలి. పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్‌తో నింపేసిన ఈ టీజర్‌ను మెచ్చిన వాళ్లు చాలా తక్కువ మంది. టీజర్లో చాలా విషయాలు జనాలకు అభ్యంతరకంగా అనిపించాయి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో అయితే చాలా విమర్శలే వచ్చాయి.

రామాయణ గాథను టెక్నాలజీ పేరు చెప్పి చెడగొట్టే ప్రయత్నంలా ‘ఆదిపురుష్’ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే రావణుడు, హనుమంతుడు పాత్రలను పోషించిన నటుల వేషధారణ విషయంలోనూ చాలా అభ్యంతరాలు వచ్చాయి. టీజర్ వచ్చి మూడు రోజులైన ‘ఆదిపురుష్’ మీద ట్రోలింగ్ ఆగట్లేదు.

ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా మీద ఈ స్థాయి నెగెటివిటీ రావడం చిత్ర బృందాన్ని కంగారు పెట్టినట్లే కనిపిస్తోంది. అందుకే ఒకసారి మీడియాను కలిసి ఇందులో అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని, తమ వెర్షన్ చెప్పాలని ‘ఆదిపురుష్’ టీం ఫిక్సయినట్లు తెలుస్తోంది. దసరా మరుసటి రోజు, గురువారం హైదరాబాద్‌లో ‘ఆదిపురుష్’ టీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనుందట. ఇందులో హీరో హీరోయిన్లు ప్రభాస్, కృతి శెట్టిలతో పాటు దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్ పాల్గొనబోతున్నట్లు తెలిసింది.

టీజర్ విషయంలో వచ్చిన నెగెటివ్ ఫీడ్ బ్యాక్, అభ్యంతరాలు సహా అన్ని విషయాలపై టీం మాట్లాడనుందట. ఐతే ఈ సందర్భంగా మీడియా నుంచి కొన్ని ఘాటు, ఇబ్బందికర ప్రశ్నలు ఎదురు కావడం ఖాయం. ముఖ్యంగా దర్శకుడు ఓం రౌత్‌కు ఈ ప్రెస్ మీట్ సవాలనే చెప్పాలి. మరి విమర్శలు, ట్రోలింగ్ మీద అతనెలా స్పందిస్తాడు.. ‘ఆదిపురుష్’ సినిమా విషయమై ప్రేక్షకుల్లో నెలకొన్న అయోమయాన్ని ఎంత మేర తొలగిస్తాడు అన్నది చూడాలి.