హీరోలెందుకు పారితోషకం తగ్గించుకోవాలి-బండ్ల గణేష్

ఓవైపు థియేట్రికల్ రెవెన్యూ బాగా తగ్గిపోతుండగా.. మరోవైపు హీరోలు, దర్శకులతో సహా అందరి పారితోషకాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగి నిర్మాతలకు చాలా భారంగా మారిందని.. ఈ పరిస్థితి మారే వరకు షూటింగ్స్ ఆపాలని తెలుగు ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్ ఇటీవల నిర్ణయించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ఐతే గిల్డ్‌లో సభ్యుడే అయిన సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తన సినిమాల షూటింగ్స్ ఆపట్లేదని తేల్చి చెప్పారు. హీరోలు, దర్శకుల పారితోషకాలు తగ్గించాలన్న డిమాండ్‌ను ఆయన వ్యతిరేకించారు. మార్కెట‌్‌ను బట్టే ఎవరికైనా రెమ్యూనరేషన్లు ఇస్తామన్నారు. ఇప్పుడు మరో నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు ఆయనతో గొంతు కలిపాడు. గిల్డ్‌‌లోని పెద్దల మీద విమర్శలు గుప్పిస్తూ.. హీరోలు, దర్శకులను అతను వెనకేసుకొచ్చాడు. సినిమాలు తీయడం చేతకాని వాళ్లే హీరోల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడతారని అతను సెటైర్ వేయడం గమనార్హం.

‘‘అశ్వినీదత్‌ గారి మాటలతో నేను ఏకీభవిస్తున్నా. హీరోలు పారితోషకం తగ్గించుకోవాలనే అర్హత మనకెవరికీ లేదు. అలా అడగకూడదు. కార్లలో రకరకాలుంటాయి. ఒక్కో కారుకు ఒక్కో రేటు ఉంటుంది. అలాగే హీరోల్లో కూడా ఒక్కొక్కరికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజికి తగ్గట్లు రెమ్యూనరేషన్లు ఇస్తారు. హీరోలెవరూ నాతో సినిమా తీయి, నాకింత పారితోషకం ఇవ్వు అని డిమాండ్ చేయరు. నిర్మాతలే వారి దగ్గరికి వెళ్లి.. సినిమా చేయమని బతిమాలుకుంటారు. మీ రేంజ్ ఇంత, మార్కెట్ ఇంత అని రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తారు. సినిమా ఎంత బాగా తీయాలి అని చూడాలి కానీ.. హీరోల మీద పడి ఏడిస్తే లాభం లేదు. గిల్డంట గిల్డు.. ఎందుకండీ ఈ గిల్డ్? సినిమాలు సరిగ్గా తీయాలి కానీ.. ఈ మీటింగులెందుకు? గిల్డ్‌లో సభ్యులుగా ఉన్న వాళ్లలో చాలామంది సినిమాలు తీయరు. ఈ రోజుల్లో కాల్ షీట్లకు, షీట్లకు తేడా తెలియని వాళ్లు.. షూటింగ్ ఎన్నింటికి మొదలై ఎప్పుడు ప్యాకప్ అవుతుందో తెలియని వాళ్లు.. ఏ రోజు ఏ లైట్లు వాడతారో.. ఏ లొకేషన్‌కు ఎంత ఛార్జ్ అవుతుందో తెలియని వాళ్లు సినిమాలు తీస్తున్నారు.

చెయ్యలేక మంగళవారం అన్నాడట ఎవడో.. ఇవాళ మంగళవారం కాకపోతే నీ అంతు చూస్తాడన్నాడట. అలా సినిమా తీయడం రాక మీటింగులు పెడితే ఏం లాభం? సురేష్ బాబు.. అశ్వినీదత్.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సినిమాలు తీయట్లేదా? ఎన్టీ రామారావు, ఏఎన్నార్, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు కంటే గొప్పోళ్లా ఇప్పుడున్న నిర్మాతలు? వాళ్లేమైనా వచ్చి మాతో సినిమా తీయమని ఎప్పుడైనా అడిగారా? హీరోలెప్పుడూ అలా అడగరు. వాళ్లు డెమీ గాడ్స్. సినిమాను ప్రేమిస్తే.. హీరోను కూడా ప్రేమిస్తే మంచి సినిమాలు వస్తాయి. స్క్రిప్ట్ మీద దృష్టిపెట్టాలి. పేపర్ మీదే ఎడిట్ చేసుకోవాలి. స్టోరీ బోర్డ్ ఉండాలి. వర్కింగ్ డేస్ తగ్గించాలి. అవన్నీ చేసుకుని జాగ్రత్తగా తీస్తే బ్లాక్‌బస్టర్లు అవే వస్తాయి’’ అని బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.