డిజాస్టర్ హీరో, డిజాస్టర్ డైరెక్టర్ కలిసి..

ఈ ఏడాది సంక్రాంతికి ‘ఎంతమంచివాడవురా’ సినిమాతో పలకరించాడు నందమూరి కళ్యాణ్ రామ్. అసలే అతడి కెరీర్ అంతంతమాత్రంగా సాగుతుంటే.. ఈ సినిమా మరీ దారుణమైన ఫలితాన్నందించి కెరీర్‌ను మరింతగా దెబ్బ తీసింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఇదొకటని చెప్పొచ్చు.

ఆ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ బ్రేక్ తీసుకున్నాడు. కొత్త సినిమా ఏదీ ఖరారు చేయలేదు. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా అన్నారు కానీ.. దాని సంగతి ఏమీ తేలలేదు. ఐతే ఇప్పుడు కళ్యాణ్ రామ్ తనలాగే జనవరి నెలలో పెద్ద డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో పని చేయబోతుండటం విశేషం. ఆ దర్శకుడు మరెవరోకాదు.. వీఐ ఆనంద్. అతడి చివరి సినిమా ‘డిస్కో రాజా’.. సంక్రాంతి తర్వాత రిలీజై దారుణమైన ఫలితాన్నందుకుంది.

కొన్నేళ్ల కిందట ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో భారీ విజయాన్నందుకున్నాడు ఆనంద్. ఆ తర్వాత తీసిన ‘ఒక్కక్షణం’, ‘డిస్కో రాజా’ కూడా భిన్నమైన కథలతో తెరకెక్కినవే. కానీ వాటి ఎగ్జిక్యూషన్ సరిగా లేక బోల్తా కొట్టాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కోసం మరో భిన్నమైన కథనే రెడీ చేశాడట ఆనంద్. కమర్షియల్‌గా కూడా వర్కవుటయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని.. ఇద్దరూ కలిసి ఓ మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారట.

ఈ చిత్రానికి నిర్మాత ఎవరో ఇంకా వెల్లడి కాలేదు. వేరే ప్రొడ్యూసర్ దొరక్కపోతే కళ్యాణ్ రామే నిర్మించే అవకాశముంది. మరోవైపు కళ్యాణ్ రామ్.. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోయే కొత్త చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కంటే ముందే ఆనంద్ దర్శకత్వంలో తన సినిమాను కళ్యాణ్ రామ్ మొదలుపెట్టే అవకాశముంది.