ఓటీటీలో ఇప్పుడే కాదుకరోనా మహమ్మారి సినిమా డైనమిక్స్‌ను చాలా మార్చేసింది. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు గణనీయ సంఖ్యలో తగ్గిపోయారు గత రెండేళ్లలో. కరోనా వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటుకు బ్రేక్ పడింది. దీనికి తోడు ఓటీటీలకు జనం బాగా అలవాటు పడిపోయారు. ఈ ప్రతికూలతలు చాలవన్నట్లుగా టికెట్ల ధరలను విపరీతంగా పెంచేయడం ప్రేక్షకులను థియేటర్లకు మరింత దూరం చేసింది.
ఒకప్పుడు మంచి క్రేజున్న స్టార్ హీరోల సినిమాలకు వీకెండ్స్‌లో టికెట్లు దొరకడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు తొలి రోజు మెయిన్ థియేటర్లలో ఫుల్స్ పడని పరిస్థితి వచ్చింది. ఆచార్య, సర్కారు వారి పాట లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఇంత పెద్ద సినిమాల పరిస్థితే ఇలా ఉంటే.. చిన్న, మీడియం రేంజ్ చిత్రాల సంగతి చెప్పాల్సిన పనే లేదు.
ప్రభుత్వం రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది కదా అని ఏడాది ముందున్న రేట్లతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో ధరలు పెంచి పడేస్తే.. పెద్ద సినిమాలకు అదనంగా రేట్లు వడ్డిస్తుంటే థియేటర్లకు వెళ్లి ఎవరు సినిమాలు చూస్తారు?స్వయంగా దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత.. ఓ వర్గం ప్రేక్షకులుు థియేటర్లకు రావడం మానేశారని అంగీకరించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే ‘ఎఫ్-3’ సినిమాకు అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉన్నప్పటికీ.. ఆ ఆప్షన్ తీసుకోలేదు రాజు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన వెల్లడించారు. అలాగే ఇంటర్వ్యూల్లో కూడా దీని గురించి నొక్కి వక్కాణించారు. మరోవైపు రాజశేఖర్ సినిమా ‘శేఖర్’ పోస్టర్ల మీద పాత రేట్లతో టికెట్ల అమ్మకం అంటూ ప్రత్యేకంగా వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక అడివి శేష్ సినిమా ‘మేజర్’కు ప్రత్యేకంగా చొరవ తీసుకుని సింగిల్ స్క్రీన్లలో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.195 రేట్లు పెట్టించారు.
ఎక్కడైనా రేట్లు ఎక్కువ అని తన దృష్టికి వస్తే.. ఎగ్జిబిటర్లతో మాట్లాడి మరీ రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు శేష్. ఇదిలా ఉంటే.. కొత్త సినిమాలు ఓటీటీల్లో త్వరగా వచ్చేస్తుండటం వల్ల థియేటర్లకు రావడం తగ్గించేస్తుండటంతో తమ చిత్రాలు ఇప్పుడే ఓటీటీల్లోకి రావట్లేదని స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా చూస్తున్నామిప్పుడు. ‘ఎఫ్-3’ విషయంలో అదే జరిగింది. ‘ఆచార్య’, ‘సర్కారు వారి పాట’ మూడు వారాలకే ఓటీటీల బాట పట్టడంతో ‘ఎఫ్-3’ కూడా అదే దారిలో నడుస్తుందేమో అని ఎక్కడ థియేటర్లకు రావడం మానేస్తారో అని వెంకీ, వరుణ్, అనిల్ రావిపూడి కలిసి ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. తమ చిత్రం 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని.. కాబట్టి థియేటర్లకే వచ్చి సినిమా చూడాలని వాళ్లు పిలుపునిచ్చారు.