బిగ్ క్వశ్చన్.. అసలు వైఎస్ ఆ మాట అన్నాడా?

నేరుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టే వాళ్ల సంగతి పక్కన పెడితే.. సినిమా వాళ్లు చాలా వరకు రాజకీయాలకు దూరంగానే ఉంటారు. తమకు అంతర్గతంగా ఎలాంటి రాజకీయ భావజాలం ఉన్నా ఆ విషయాన్ని బయట పెట్టడానికి ఇష్టపడరు. రాజకీయాలకు సంబంధించి తమ ఇష్టాయిష్టాలను బయటపెడితే ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ఐతే ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటారో.. ఎవరు మారతారో చెప్పలేం. ఐతే చాలా మందికి భిన్నంగా యువ దర్శకుడు పరశురామ్.. తన పొలిటికల్ ఇంట్రెస్ట్‌లను బయట పెట్టేశాడు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పెద్ద అభిమానినని.. అలాగే ప్రస్తుత సీఎం జగన్‌ అన్నా ఇష్టమే అని బయట పెట్టేశాడు. ఈ చర్చ అసలు మొదలైంది ‘సర్కారు వారి పాట’ టీజర్లో వినిపించిన ‘నేను విన్నాను నేను ఉన్నాను’ డైలాగ్ నుంచే. అది ‘యాత్ర’ సినిమాలో వైఎస్ పాత్ర పలికే డైలాగ్. దాన్ని ఎన్నికల ప్రచారంలో జగన్ వాడుకున్నారు.

ఇప్పుడు ‘సర్కారు వారి పాట’లో మహేష్ నోటి నుంచి ఆ డైలాగ్ రావడంతో ఏపీ సీఎం జగన్‌ను మెప్పించడానికే ఈ డైలాగ్ పెట్టారనే చర్చ మొదలైంది. ఈ విషయంలో మహేష్ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. మరి ఈ డైలాగ్ పెట్టడానికి కారణమేంటి అని అడిగితే.. తాను వైఎస్‌కు పెద్ద అభిమానిననే విషయాన్ని వెల్లడిస్తూ.. సినిమాలో సందర్భానికి తగ్గట్లుగా ఆ డైలాగ్‌ను వాడుకున్నట్లు చెప్పాడు పరశురామ్.

ఐతే ఈ విషయంలో అతను ఇస్తున్న వివరణే ఆశ్చర్యం కలిగిస్తోంది. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోజుల్లో వైఎస్ ‘నేను విన్నాను నేను ఉన్నాను’ అనే మాట అనడం తనకు బాగా నచ్చిందని, చాలా తక్కువ పదాలతో చాలా పెద్ద భావం చెప్పారని, జనాలకు భరోసా ఇచ్చారని అనిపించిందని.. దీంతో ఇప్పుడు ఆ మాటను సినిమాలో వాడానని చెప్పాడు పరశురామ్.

కానీ వైఎస్ జన బాహుళ్యంలో ఎప్పుడు ఈ డైలాగ్ చెప్పినట్లుగా ఏ ఆధారాలు లేవు. ‘యాత్ర’ సినిమాలో నాటకీయత కోసం ఆ డైలాగ్ పెట్టారే తప్ప.. నిజంగా ఆ మాటను వైఎస్ అన్నట్లుగా అంతకుముందు వరకు ఎవ్వరూ చెప్పుకోలేదు. దీనికి సంబంధించి పేపర్ క్లిప్పింగ్స్ కానీ, వీడియోలు కానీ ఉన్నాయా అన్నది అనుమానమే.

సినిమాలోనే ఈ డైలాగ్ తొలిసారి జనాలు విన్నారు. తర్వాత జగన్ ఈ మాటను పలుమార్లు వాడడంతో అది పాపులరైంది. కానీ పరశురామ్ మాత్రం వైఎస్ నుంచే ఆ మాట విన్నట్లు ఇంటర్వ్యూల్లో చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి వైఎస్ ఫ్యాన్స్ ఎవరైనా.. నిజంగానే ఆయనా మాట అన్నట్లు ఆధారాలు చూపిస్తారేమో చూడాలి.