మేజిక్ మిస్సవుతున్న మెలోడీ బ్రహ్మ

కొత్త తరం తెలుగు సినిమా సంగీతంలో పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా తమదంటూ ఒక ఒరవడిని ట్రెండ్ ని సృష్టించినవాళ్లలో మణిశర్మ ఒకరు. ఇళయరాజా, కీరవాణి, రెహమాన్ ల హయాం కొద్దిగా తగ్గుతున్న టైంలో మెరుపులా దూసుకొచ్చి టాలీవుడ్ లో తిరుగులేని మెలోడీ బ్రహ్మగా ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ కు ప్రాణం పోశారు. 1992లో వర్మ రాత్రికి బిజిఎంతో కెరీర్ మొదలుపెట్టి 1997లో చిరంజీవి బావగారు బాగున్నారాతో తొలిబ్రేక్ అందుకున్న మణిశర్మ అక్కడి నుంచి వెనక్కు చూసుకోవాల్సిన అవసరం పడలేదు.

సమరసింహారెడ్డి, ఇంద్ర, ఆది, ఒక్కడు, ఖుషి, మురారి, చూడాలని ఉంది, ఠాగూర్, యజ్ఞం, అతనొక్కడే, అతడు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ లో మణిశర్మ కాంట్రిబ్యూషన్ గురించి మాటల్లో చెప్పలేం. కానీ ఇదంతా గత చరిత్ర. ఇస్మార్ట్ శంకర్ తో ఈయన కంబ్యాక్ అయ్యారని సంతోషంతో మురిసిపోయిన అభిమానులకు ఆ ఆనందం కొంత కాలమే మిగిలింది. ఈ మధ్య చేసిన సినిమాల్లో మణిశర్మ మునుపటి మేజిక్ కనీసం సగం కూడా లేదని వాళ్లే బాధపడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.

ఆచార్యలో కంటెంట్ పక్కనపెడితే మ్యూజిక్ విషయంలో చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. చిన్న సినిమా భళా తందానానకు అదే రెస్పాన్స్ కనిపించింది. గత ఏడాది చేసిన వాటిలో శ్రీదేవి సోడా సెంటర్, రిపబ్లిక్, సీటిమార్, అరగుడుల బులెట్ ఇవేవి ఒకటో రెండో పాటలు తప్ప అన్నీ జీరో ఇంపాక్ట్ ఇచ్చినవే. ఇంకా దర్శకులు మణి మీద నమ్మకంతో ఉన్నారు. శాకుంతలం, నేను మీకు బాగా కావాల్సిన వాడిని లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. వీటిలో ఒక్కటి చార్ట్ బస్టర్ అయినా చాలు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.