రాజమౌళి ప్రయత్నాలు ఆపలేదు, హీరోలు కదలట్లేదు!

ట్రయల్ షూట్ చేసుకుని ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని రాజమౌళి గట్టిగా కృషి చేస్తున్నాడు. ట్రయల్ షూట్ అనుకున్న సమయానికి జరగకపోయినా రాజమౌళి పట్టు వీడలేదు. ఈ నెల 25న ట్రయల్ షూట్ గండిపేటలో పెట్టుకున్నాడు. రెండు రోజుల పాటు ఈ ట్రయల్ షూట్ జరుగుతుంది. పీపీఈ కిట్లు, పరిమిత సిబ్బంది వగైరా జాగ్రత్తలతో ఈ షూట్ చేయబోతున్నారు.

దీనికి హీరోలు తారక్, చరణ్ హాజరు కావడంలేదు. వారికీ బదులు డూప్స్ ని పెట్టి షూట్ చేస్తారు. రాజమౌళికి షూటింగ్ మళ్ళీ ట్రాక్ ఎక్కించాలనే బలమైన సంకల్పం ఉన్నా కానీ చరణ్, తారక్ ఇద్దరూ అందుకు అనుకూలంగా లేరని వినిపిస్తోంది. ఆ మాటకు వస్తే ప్రస్తుతం రిస్క్ తీసుకోవడానికి తొంభై శాతం నటీనటులు సిద్ధంగా లేరు.

పరిస్థితులు నార్మల్ అయ్యే వరకు వేచి చూడాలనే అందరూ డిసైడ్ అయ్యారు. అవసరం అనుకుంటే పారితోషికాలు తగ్గించుకుని నష్టాలు భర్తీ చేసుకోవచ్చు కానీ రిస్క్ దేనికని భావిస్తున్నారు. అయితే తారక్, చరణ్ వచ్చినా, రాకపోయినా కరోనా టైంలో షూటింగ్స్ ఎలా చేస్తే ఉత్తమం అనేదానికి ఉదాహరణగా అయినా ఇది నిలుస్తుందని రాజమౌళి తన ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాడు.