గెస్ట్ రోల్ చిరుదా.. చ‌ర‌ణ్‌దా?

మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తూ వ‌చ్చిన ఆచార్య ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. మంగ‌ళ‌వారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేట‌ర్ల‌లో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. ఆ త‌ర్వాత కాసేప‌టికే సోష‌ల్ మీడియాలోకి కూడా వ‌చ్చేసింది ట్రైల‌ర్. అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే మాస్‌, యాక్ష‌న్, ఎమోష‌న్లు క‌ల‌బోసిన విధంగా ట్రైల‌ర్ ఉండ‌టంతో వారి క‌డుపు నిండిపోయింది.

ఐతే ట్రైల‌ర్లో ఓ విష‌యం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచి.. డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారింది. అస‌లిది చిరు సినిమానా చ‌ర‌ణ్ సినిమానా.. ఇందులో గెస్ట్ రోల్ చేసింది రామ్ చ‌ర‌ణా చిరంజీవా అన్న‌దే ఆ విష‌యం. సినిమా ఏ ఆర్డ‌ర్లో ఉంటుందో అలాగే ట్రైల‌ర్ కూడా క‌ట్ చేసిన‌ట్లుగా క‌నిపించింది. ఐతే కథ మొద‌లైంది చ‌ర‌ణ్ చేసిన సిద్ధ పాత్ర‌తోనే. అత‌డి పాత్ర ముగింపుతోనే క‌థ‌లో మ‌లుపు వ‌చ్చేలా క‌నిపించింది. విల‌న్ సిద్ధ పాత్ర‌కు తెర‌దించితే.. ఆ త‌ర్వాత ఆచార్య‌గా చిరు రంగ‌ప్ర‌వేశం చేసి సిద్ధు ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌డం, ఈ క్ర‌మంలో మ‌ధ్య‌లో వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఫ్లాష్ బ్యాక్ రావ‌డం.. ఇలా క‌థ సాగుతుంద‌నిపించింది.

ట్రైల‌ర్ వ‌ర‌కు చూస్తే చ‌ర‌ణ్ సినిమాలో చిరు గెస్ట్ రోల్ చేసిన ఫీలింగే క‌లిగింది త‌ప్ప‌.. చిరు సినిమాలో చ‌ర‌ణ్ అతిథి పాత్ర చేసిన‌ట్లుగా అనిపించ‌లేదు. ఇది మెగా అభిమానుల‌కు మిశ్ర‌మానుభూతి క‌లిగించింది. దీనిపై భిన్న అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌య్యాయి. చ‌ర‌ణ్ ఇప్పుడున్న ఫాంలో ఎక్కువ స్క్రీన్ స్పేస్‌తో క‌నిపిస్తే మెగా అభిమానుల‌కు సంతోష‌మే కానీ.. అదే స‌మయంలో చిరు డౌన్ అయిపోతాడేమో, ఆయ‌న పాత్ర‌కు ప్రాధాన్యం త‌గ్గిపోతుందేమో అన్న అనుమానాలు వారిలో క‌లిగాయి. మ‌రి ఈ సందేహాల‌కు కొర‌టాల శివ ఎలా బ‌దులిస్తాడో చూడాలి మ‌రి.