చిరు-సుశ్మిత.. ఒక స్పెషల్ వీడియో

మొన్ననే తెలుగు-తమిళ కథానాయకుడు ఆది పినిశెట్టి తన తండ్రికి ఇంట్లోనే కటింగ్, షేవింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పని చేశాక అతను తండ్రి దగ్గర డబ్బులు కూడా తీసుకోవడం విశేషం. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుంచి కూడా ఇలాంటి స్పెషల్ వీడియో ఒకటి బయటికొచ్చింది. దాన్ని చిరు పెద్ద కూతురు సుస్మిత షేర్ చేయడం విశేషం.

ఈ వీడియోలో చిరుకు ఆమె కటింగ్ చేయడం విశేషం. తన లాక్‌డౌన్ యాక్టివిటీస్‌లో ఇదొకటి అంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసింది. సెలూన్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడం, బార్బర్లూ ఇంటికి వచ్చేలా లేకపోవడంతో మన కుటుంబ సభ్యులకు మనమే ఇలా చేయాల్సి ఉంటుందని ఆమె తెలిపింది. చిరు కూడా నవ్వుతూ ఆమెతో మాట కలిపాడు. మనకు మనమే ఇలా సాయం చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఈ వీడియోలో చిరు కొంచెం ఎక్కువ జుట్టుతోనే కనిపిస్తున్నాడు.

కరోనా రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో బార్బర్లను ఇంటికి పిలిపించుకుని కటింగ్ అదీ చేయించుకోవడానికి కూడా సెలబ్రెటీలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరుకు సుశ్మిత సాయం చేసినట్లుంది. సుశ్మిత బేసిగ్గా కాస్ట్యూమ్ డిజైనర్ కమ్ ఫ్యాషన్ డిజైనర్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి హేర్ స్టైల్ సెట్ చేయడంలోనూ కొంత అనుభవం ఉండే ఉంటుంది.

ఆమె మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ నుంచి ఆయన సినిమాలకు వరుసగా కాస్ట్యూమ్ డిజైనరస్‌గా పని చేస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి భారీ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలందుకుంది. చిరు కొత్త సినిమా ‘ఆచార్య’కు సైతం సుస్మితనే కాస్ట్యూమ్స్ సమకూరుస్తుండటం విశేషం.