హిట్టు కొట్టి కూడా ఖాళీగా వున్నాడు

Director Maruthi

యావ‌రేజ్‌, బిలో యావ‌రేజ్ ఇచ్చిన ద‌ర్శ‌కులు సైతం.. కామ్‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కించేస్తున్నారు. అలాంటిది ఓ సూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు హీరోలేక ఖాళీగా ఉండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. ఆ దర్శ‌కుడెవ‌రో కాదు.. మారుతి.

‘ప్ర‌తిరోజూ పండ‌గే’లో ఓ హిట్టు కొట్టాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ కెరీర్‌లో ఇదే పెద్ద హిట్టు. ఆ సినిమా గ‌తేడాది డిసెంబ‌రులో విడుద‌లైంది. అంటే.. ఇప్ప‌టికి ఏడు నెల‌లు గ‌డిచిపోయాయి. అయినా మారుతి త‌దుప‌రి సినిమా ఏమిట‌న్న‌ది ఇంకా క్లారిటీ రాలేదు.

ముందు రామ్ తో ఓ సినిమా చేద్దామ‌నుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్యా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. కానీ… కుద‌ర్లేదు. వ‌రుణ్ తేజ్‌, నాని, శ‌ర్వానంద్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇలా ఏ హీరోని చూసినా బిజీ.. బిజీ. వీళ్లెవ్వ‌రూ 2021 వ‌ర‌కూ కాల్షీట్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. పోనీ.. సాయిధ‌ర‌మ్ తోనే మ‌రో సినిమా చేద్దామా? అనుకున్నా, కుద‌ర‌ని ప‌ని. ఎందుకంటే త‌న చేతిలోనే ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ ఒకే హీరోతో సినిమా చేసినా కిక్ ఇవ్వ‌దు.

ఇలా ఎలా చూసినా 2021 లోనూ మారుతి సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. చేతిలో ఉన్న సినిమా చేజారిపోయి, అనూహ్యంగా ఏ హీరో అయినా ఖాళీ అయిపోతే త‌ప్ప‌.. ఇప్ప‌టికిప్పుడు మారుతి సినిమా ఏదీ ప‌ట్టాలెక్క‌దు. ఈ విష‌యం తెలిసేనేమో.. మారుతి కూడా ప్ర‌త్యామ్నాయ మార్గాన్ని అన్వేషించుకుంటున్నాడు. ఈలోగా ఓ వెబ్ సిరీస్ పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడు. ‘ఆహా’ కోసం ఓ స్క్రిప్టుని కూడా సిద్ధం చేశాడ‌ని టాక్‌.