నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు నిజంగా అభిమానా? ఇప్పుడు చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఇంతకుముందు దీనిపై సందేహాలుండేవి కానీ.. ఇటీవల ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో బాలయ్యే స్వయంగా జగన్ తన అభిమాని అని తెలుసని.. అతను కడప టౌన్ బాలయ్య అభిమానుల సంఘం ప్రెసిడెంట్‌గా ఉండేవాడని ధ్రువీకరించడంతో అయోమయం నెలకొంది.
జగన్ అయితే ఎప్పుడూ తాను బాలయ్య అభిమానని చెప్పలేదు. ఐతే సమరసింహారెడ్డి విడుదల సమయంలో బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడిగా జగన్ ఇచ్చినట్లుగా ఓ యాడ్ మాత్రం ఆ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కానీ అది ఫేక్ అంటూ కూడా ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో బాలయ్యకు జగన్ అభిమానా కాదా అనేదానిపై అయోమయం కొనసాగుతోంది. ఈ విషయాన్ని క్లియర్ చేయాల్సింది జగన్. కానీ ఆయన ఇప్పుడు దీనిపై స్పందిస్తాడని అనుకోలేం. ఐతే రాయలసీమలో బాలయ్యకు వీరాభిమానిగా పేరున్న అనంతపురం జగన్.. ఈ వషయంలో స్పష్టత ఇచ్చాడు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో.
అప్పట్లో అభిమానులు తమ సంఘాలకు గౌరవాధ్యక్షులుగా జిల్లాల్లో పేరున్న కుటుంబాల్లోని యువ నాయకుల పేర్లు వాడుకునేవారని.. తమకు ఏదైనా సమస్య వస్తే, ఇబ్బందులు ఎదురైతే వాళ్లు సాయం చేస్తారని ఇలా చేసేవారని.. జగన్ పేరును కూడా కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘం గౌరవాధ్యక్షుడిగా ఇలాగే పెట్టుకున్నారని.. అంతకుమించి ఏమీ లేకపోవచ్చని అతను చెప్పాడు. మరి ఇదెంతవరకు పక్కా సమాచారమో?