ఢీ సీక్వెల్.. టైటిల్ పెట్టేశారా?

Dhee

మ‌ంచు విష్ణు కెరీర్‌లో అతి పెద్ద హిట్ అంటే.. ఢీ సినిమానే. ఇంకా చెప్పాలంటే విష్ణు కెరీర్లో ఏకైక సూప‌ర్ హిట్ కూడా ఇదే. దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి హిట్లు ఉన్నా కూడా ఢీ రేంజ్ వేరు. అలాంటి హిట్ విష్ణుకు మ‌ళ్లీ ఎప్పుడు వ‌స్తుందా అని మంచు ఫ్యామిలీ ఎదురు చూస్తోంది. కానీ ఏ ద‌ర్శ‌కుడూ అత‌డికి అలాంటి ఫ‌లితాన్నివ్వ‌లేక‌పోయాడు.

ఐతే ఇప్పుడు మ‌ళ్లీ అత‌ను స‌క్సెస్ కోసం శ్రీను వైట్ల‌నే న‌మ్ముకున్న‌ట్లున్నాడు. వీళ్ల‌ద్ద‌రి క‌ల‌యిక‌లో ఢీ సీక్వెల్ గురించి కొంత కాలంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య ఢీ సినిమా వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కూడా విష్ణు దాని సీక్వెల్ గురించి చూచాయిగా చెప్పాడు. ఐతే ఇప్పుడు విష్ణు, శ్రీను వైట్ల మ‌ధ్య ఈ సినిమాకు అంగీకారం కుదిరిన‌ట్లే క‌నిపిస్తోంది.

ఢీ అండ్ ఢీ పేరుతో విష్ణు, వైట్ల క‌లిసి సినిమా చేయ‌డానికి రెడీ అవ‌తున్నార‌ట‌. డేరింగ్ అండ్ డాషింగ్ అనేది దీనికి క్యాప్ష‌న్ అట‌. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని.. ఇద్ద‌రూ మ‌ళ్లీ మంచి స‌క్సెస్ అందుకోవాల‌ని విష్ణు, వైట్ల భావిస్తున్నార‌ట‌. మంచు వారి బేన‌ర్లోనే ఈ సినిమా తెర‌కెక్కే అవ‌కాశ‌ముంది.

ఢీ సినిమాతోనే శ్రీను వైట్ల రేంజ్ మారింది. స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడు. ఆపై మ‌హేష్ బాబు స‌హా పెద్ద పెద్ద హీరోల‌తో సినిమాలు చేశాడు. కానీ ఆగ‌డు నుంచి వైట్ల క‌థ మారిపోయింది. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో రేసులో బాగా వెనుక‌బ‌డిపోయాడు. ఇప్పుడు మీడియం రేంజి హీరోలు కూడా అత‌డిత సినిమా చేయ‌డానికి రెడీగా లేరు. అటు విష్ణుతో కూడా ఓ మోస్త‌రు ద‌ర్శ‌కులెవ‌రూ ప‌ని చేసే ప‌రిస్థితి లేదు. ఇలాంటి స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లిసి ఒక‌రికొక‌రు బ్రేక్ ఇచ్చుకోవాల‌ని చూస్తున్న‌ట్లున్నారు.