కరణ్ జోహార్ కోటలో జాన్వీ కపూర్

స్టార్ కిడ్స్ అందరికీ కరణ్‌ జోహార్‌‌ బ్యానర్‌‌ నుంచి లాంచింగ్ ఫ్రీ అనే ఆఫర్ ఉంటుంది బాలీవుడ్‌లో. బడా స్టార్స్ పిల్లలందరినీ తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేయడం కరణ్‌కి అలవాటైతే.. తమ పిల్లల్ని ఆయనకి అప్పగించడం బీటౌన్‌ స్టార్స్‌కి సెంటిమెంట్. అందుకే శ్రీదేవి లాంటి లేడీ సూపర్‌‌ స్టార్‌‌ కూడా తన కూతురు జాన్వీ కపూర్‌‌ని కరణ్ చేతిలోనే పెట్టింది. అయితే లాంచ్‌ చేసి వదిలేయకుండా జాన్వీ కెరీర్‌‌లో పెద్ద పాత్రే పోషిస్తున్నాడు కరణ్.

మరాఠీ సూపర్‌‌ హిట్ ‘సైరాట్’ హిందీ రీమేక్ ‘ధడక్‌’తో జాన్వీని వెండితెరకి పరిచయం చేశాడు కరణ్. ఆ తర్వాత అతను నిర్మించిన ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా చిత్రాల్లో నటించిందామె. ఇతర సంస్థలతోనూ అంగ్రేజీ మీడియమ్, రూహీ లాంటి చిత్రాలు చేసిందఇ. కానీ ఎక్కువ సినిమాలు మాత్రం కరణ్‌తోనే చేస్తోంది. ఆల్రెడీ ‘దోస్తానా 2’లో నటిస్తోంది. ఇప్పుడు ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ అనే మూవీకి కూడా కమిటయ్యింది. ఇవాళే ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. రాజ్‌ కుమార్ రావ్ హీరోగా నటిస్తున్నాడు. శరణ్ శర్మ దర్శకుడు.

ఇలా మాటిమాటికీ కరణ్‌ బ్యానర్‌‌లో జాన్వీ కనిపించడం ఆమెకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. తాను ప్లాన్ చేసిన చిత్రాల్లో ఆమెకి చోటు కల్పిస్తున్నాడా లేక తనని ప్రమోట్ చేయడం కోసమే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొదటిది కారణమైతే పర్లేదు కానీ రెండో కారణమే కరెక్టయితే మాత్రం జాన్వీ కెరీర్‌‌కి మైనస్ అవ్వడం ఖాయం. తనకి సరైన అవకాశాలు రాకపోవడం వల్లే కరణ్ పనిగట్టుకుని ప్రమోట్ చేస్తున్నాడనే మచ్చ ఆమె కెరీర్‌‌ మీద పడితే తనకి నష్టమేగా మరి. పైగా ఆయనతో జాన్వీ చేసిన సినిమాల వల్ల తనకి ఒరిగింది కూడా ఏమీ లేదు. ఒక్క హిట్ కూడా ఇంతవరకు జాన్వీ ఖాతాలో పడలేదు.

నిజానికి జాన్వీ వెనకాల బోనీ కపూర్‌‌ ఉన్నాడు. ఆయన కూడా టాప్ ప్రొడ్యూసరే. ప్రస్తుతం జాన్వీతో ‘మిలీ’ అనే మూవీ కూడా నిర్మిస్తున్నాడాయన. కానీ తన కూతురితో సినిమా తీయడానికి ఆయన ఇంత టైమ్ ఎందుకు తీసుకున్నాడనేదే ప్రశ్న. తమిళంలో అజిత్, తెలుగులో పవన్‌ కళ్యాణ్ లాంటి వారితో సినిమాలు నిర్మించగల సత్తా ఉన్న బోనీ.. వరుస పరాజయాలతో వెనకబడ్డాక కానీ కూతురి కెరీర్ నిలబెట్టడానికి పూనుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. మరోవైపు త్వరలో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని, ఎన్టీఆర్–కొరటాల సినిమాలో తనే హీరోయిన్‌ అనీ వార్తలు వస్తున్నాయి. ఆ నిర్మాతలతో కరణ్ చేయి కలిపినా ఆశ్చర్యపోనవసరం లేదేమో.