తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ జరిపిన చర్చలకు తనను పిలవలేదంటూ కొన్ని రోజుల కిందట నందమూరి బాలకృష్ణ ఎంత అసహనం చెందాడో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చాలామంది బాలయ్యకు మద్దుతగా మాట్లాడారు. టీవీ చర్చల్లో కూర్చుని కొట్లాడేశారు. ఆయన్ని పిలవాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఉంది కదా.. కాబట్టి వాళ్లదే తప్పు అని తేల్చేశారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ నెల 9న సినీ పెద్దలు కలవబోతున్నారు. తమపై మాట రాకుండా ఈసారి బాలయ్యను పిలిచారు. కానీ ఆయనేమో రాననేశారు. తన పుట్టిన రోజు వేడుకల నేపథ్యంలో ఈ సమావేశానికి రాలేనని బాలయ్య అన్నారట.
బాలయ్యకు ఈసారి జరగబోయేది 60వ పుట్టిన రోజు. ఈసారి కొంచెం ఘనంగానే చేయబోతున్నారు. ఈ కారణం చూపి ఆయన సమావేశానికి నో చెప్పారు. కారణం ఏదైనా సరే.. బాలయ్య ‘నో’ అనడంతో ఆయన ఇప్పుడు నిందను మోయాల్సి వస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు బాలయ్యను పిలవకపోవడం గురించి ఇండస్ట్రీ పెద్దలు అంతర్గతంగా అన్న మాట.. ఆయన పిలిచినా రారు అనే. బాలయ్యదంతా వేరే రూటు. ఆయన ఇలాంటి వ్యవహరాల్లో కలిసి సాగరు. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తాను ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోననే అన్నారు. మరి తనను పిలవకపోవడంపై అంతేసి మాటలు ఎందుకన్నారో? ఇప్పుడు ఇప్పుడు జగన్‌తో మీటింగ్‌కి పిలిచినా బాలయ్య రాననడంతో.. ‘చూశారా.. ఇదీ వరస. ఆయన పిలిస్తే రారు. పిలవకుంటే పిలవలేదంటారు’ అని అవతలి వర్గం బాలయ్యను టార్గెట్ చేయడానికి అవకాశమిచ్చారు.
ఆల్రెడీ సోషల్ మీడియాలో మోత మొదలైపోయింది. అయినా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్యమంత్రికి దగ్గరికి సినీ పరిశ్రమ ప్రతినిధిగా వెళ్లి ఆయనతో బాలయ్య చర్చిస్తాడని ఎవరైనా ఎలా అనుకుంటారు. ఇప్పుడు పుట్టిన రోజు వేడుకల సాకు చెప్పాడు కానీ.. వేరే సమయాల్లో అయినా ఇంకేదో కారణం చెప్పి బాలయ్య డుమ్మా కొట్టేవాడే. తెలంగాణ ప్రభుత్వంతో సమావేశాలకు పిలిచి ఉన్నా ఇదే జరిగేదేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates