విజయ్ దేవరకొండ స్థానంలో చైతు!

అక్కినేని నాగచైతన్య ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలానే ఇదే డైరెక్టర్ రూపొందించనున్న హారర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు. వీటితో పాటు కొన్ని కథలు కూడా వింటున్నాడు. తాజాగా నందిని రెడ్డి చెప్పిన కథకు చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం నందిని రెడ్డి సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పూర్తయిన వెంటనే చైతు సినిమా మొదలవుతుందట. ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్లే. ‘బంగార్రాజు’ సినిమా కోసం చైతు 20 నుంచి 25 రోజుల కాల్షీట్స్ ఇస్తే చాలు. ఆ తరువాత నందిని రెడ్డి సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు.

అలానే ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కూడా చైతు ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పటివరకు కథ సెట్ అవ్వలేదు. మరోపక్క నందిని రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు చైతు. నిజానికి నందిని రెడ్డి చాలా కాలం క్రితమే వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకుంది. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనుకుంది. అప్పట్లో విజయ్ కూడా ఆసక్తి చూపించాడు కానీ ప్రాజెక్ట్ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ కథనే చైతుతో తీయబోతున్నారని తెలుస్తోంది.