కేసులు పెరుగుతున్నాయి ప్రొడ్యూసర్ గారూ!

షూటింగ్ చేసుకోడానికి ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా… కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకే బాగా తెలుసు కనుక అలాగే చేసుకోండి అంటూ ప్రభుత్వం చెప్పేసింది. ఇక షూటింగ్స్ చేసేసుకోవచ్చు అని నిర్మాతలు ఊపిరి తీసుకుంటే… పలువురు హీరోలు మాత్రం షూటింగ్ కి వచ్చేందుకు ససేమీరా అనేస్తున్నారట.

ప్రస్తుతం అంతటా కరోనా కేసులు పెరుగుతున్నాయి కనుక ఇప్పుడు రిస్క్ దేనికని షూటింగ్ వాయిదా వేసుకోమంటున్నారట. పలువురు హీరోయిన్ల నుంచి కూడా ఇదే స్పందన వచ్చినట్టు సమాచారం. హీరోలే ముందుండి పరిశ్రమను నడిపిస్తారని నిర్మాతలు నమ్మకం పెట్టుకుంటే కరోనా విషయంలో అందరు హీరోలు హీరోల్లా ఫీల్ అవడం లేదు.

చాలా భాగం షూటింగ్ పూర్తయిన సినిమా షూటింగ్స్ పూర్తి చేయడానికి కూడా కొందరు జంకుతున్నట్టు తెలిసింది. ఒక నాలుగైదు సినిమాల షూటింగ్స్ కొన్ని వారాల పాటు ఏ ఇబ్బందీ లేకుండా సాగినట్టు సమాచారం వస్తే మిగతా వాళ్ళు ఇళ్ళు దాటి బయటకు వస్తారేమో.