మహేష్ బాబు మేకోవర్

Mahesh-babu-Parasuram

టాలీవుడ్ స్టార్ హీరోల్లో లుక్స్ పరంగా పెద్దగా మార్పు చూపించని హీరోల్లో మహేష్ బాబు ఒకడు. మిగతా హీరోల్లా హేర్ స్టైల్ మార్చడం.. గడ్డం పెంచడం.. మీసకట్టులో మార్పు చూపించడం.. డ్రెస్సింగ్ విషయంలో కొత్తగా ఏదైనా ట్రై చేయడం మహేష్ విషయంలో తక్కువే. అందులోనూ గత కొన్నేళ్లలో అయితే అతడి లుక్ మరీ మొనాటనస్‌గా తయారైంది.

‘శ్రీమంతుడు’ దగ్గర్నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు దాదాపు ఒకే లుక్‌లో కనిపిస్తూ వచ్చాడు మహేష్. ‘సరిలేరు నీకెవ్వరు’తో కథ, క్యారెక్టర్ పరంగా కొంచెం ఊపు కనిపించినా.. మహేష్ లుక్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఈ విషయంలో మహేష్ అభిమానుల నుంచే కొంత నెగెటివ్ కామెంట్లు వినిపించాయి. అతణ్ని కొత్త అవతారంలో చూడాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ ఛాన్స్ ‘సర్కారు వారి పాట’ ఇచ్చేట్లే కనిపిస్తోంది.

ఈ సినిమా టైటిల్, దీని ప్రి లుక్ చూస్తే మహేష్ బాబు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొంచెం కొత్తగా ఏదో ప్రయత్నిస్తున్నాడని అనిపిస్తోంది. ‘పోకిరి’, ‘ఖలేజా’ తరహాలో మహేష్ క్యారెక్టర్, అతడి లుక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయన్నది చిత్ర వర్గాల మాట.

ప్రి లుక్‌లో మహేష్ జుట్టు పెంచి, చెవికి పోగు తగిలించి, కొంచెం గడ్డం కూడా పెంచి కనిపించబోతున్నట్లు స్పష్టమైంది. లుక్స్ పరంగా మాత్రం అతడికి ఈ సినిమా ఒక మేకోవర్ ఇవ్వబోతోందని స్పష్టమైంది.

పరశురామ్ ఇప్పటిదాకా ఎక్కువగా క్లాస్ సినిమాలే చేశాడు కానీ.. మహేష్ కోసం మాస్ టచ్ ఉంటూనే కొత్తగా సాగే కథ తయారు చేశాడట. తాను హీరో ఎలివేషన్ సీన్స్ రాయలేక కాదు అని.. ఇప్పటిదాకా అవకాశం రాలేదని.. మహేష్ సినిమాతో ఆ అవకాశం వచ్చిందని.. ఈ సినిమా అభిమానుల్ని ఉర్రూతలూగించేలా ఉంటుందని.. మహేష్ కెరీర్లో మరో మైల్ స్టోన్ మూవీ అవుతుందని పరశురామ్ అంటుండటంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోతున్నాయి.