స్పేస్‌లో తొలిసారి మ‌హేష్ బాబు

ట్విట్ట‌ర్ కొన్ని నెల‌ల కింద‌టే అందుబాటులోకి తెచ్చిన కొత్త ఫీచ‌ర్.. స్పేస్. ఇందులో ఒక టాపిక్ ఎంచుకుని ఎంత‌మందైనా జాయిన్ అయి చ‌ర్చ పెట్టుకోవ‌చ్చు. సినీ రంగంలో ఈ స్పేస్ బాగా పాపుల‌ర్. ఎక్కువ‌గా సినిమా టాపిక్స్ మీదే నెటిజ‌న్లు ట్విట్ట‌ర్‌లో స్పేస్‌లు పెడుతుంటారు. ఈ మ‌ధ్య ఫిలిం సెల‌బ్రెటీల పుట్టిన రోజుల సంద‌ర్భంగా త‌ర‌చుగా స్పేస్‌లు పెడుతున్నారు. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున వీటిలో పాల్గొంటున్నారు. ఆ మ‌ధ్య ఈవీవీ స‌త్య‌నారాణ పుట్టిన రోజుకు పెట్టిన స్పేస్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

సోమ‌వారం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని కూడా ఒక పెద్ద స్పేసే పెట్టారు. యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు ఈ స్పేస్‌ను హోస్ట్ చేయ‌గా.. శ్రీను వైట్ల‌, గోపీచంద్ మ‌లినేని, సందీప్ రెడ్డి వంగ‌, మెహ‌ర్ ర‌మేష్, ప‌ర‌శురామ్ లాంటి చాలా మంది ప్ర‌ముఖులు ఇందులో పాల్గొన్నారు.

ఈ స్పేస్ మ‌ధ్య‌లో మ‌హేష్ బాబు సైతం జాయిన్ కావ‌డం విశేషం. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ సైతం ట్విట్ట‌ర్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. టాలీవుడ్ అనే కాదు.. సౌత్ ఇండియాలో ఇలా ట్విట్ట‌ర్ స్పేస్‌లో పాల్గొన్న పెద్ద స్టార్ మ‌హేష్ బాబే అయ్యుండొచ్చు. కాగా ఈ స్పేస్‌లో అనేక‌మంది ప్ర‌ముఖులు మ‌హేష్ గురించి త‌మ అభిప్రాయాల‌ను చాలా గొప్ప‌గా చెప్పారు.

సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. మ‌హేష్ బాబుతో సినిమా క‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పాడు. ఆల్రెడీ మ‌హేష్ బాబుకు క‌థ చెప్పాన‌ని.. ఒక ఒరిజిన‌ల్ స్టోరీతోనే ఆ సినిమా ఉంటుంద‌ని.. స‌రైన స‌మ‌యంలో ఆ సినిమా గురించి ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని చెప్పాడు. గోపీచంద్ మ‌లినేని మాట్లాడుతూ.. మ‌హేష్‌తో ఒక ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ తీయాల‌న్న‌ది త‌న కోరిక అని.. క‌చ్చితంగా సూప‌ర్ స్టార్ కోసం స్క్రిప్టు త‌యారు చేసి ఆయ‌న్ని క‌లుస్తాన‌ని అన్నాడు. మ‌హేష్ సెన్సాఫ్ హ్యూమ‌ర్‌ను ఇంకా తెర‌పై స‌రిగా ఎవ‌రూ వాడుకోలేద‌ని అత‌న‌న్నాడు.