టాలీవుడ్.. లబ్‌డబ్.. లబ్‌డబ్!


గత ఏడాది కరోనా కారణంగా మొత్తం భారతీయ ఇండస్ట్రీలో స్తబ్దత నెలకొన్న సమయంలో టాలీవుడ్ పుంజుకున్న తీరు అసాధారణం. డిసెంబర్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మొదలైన సందడి.. మూణ్నాలుగు నెలల పాటు సాగింది. సంక్రాంతికి ఎలా మోత మోగిందో తెలిసిందే. ఆ తర్వాత అన్ సీజన్లయిన ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ తెలుగు సినిమాలు హోరెత్తించాయి.

వేసవిలో సందడి మరో స్థాయికి చేరుతుందనుకుంటే కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని బ్రేకులు పడిపోయాయి. మూడు నెలలకు పైగా విరామం తర్వాత ఇప్పుడు టాలీవుడ్ రీస్టార్ట్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది లాగే ఈసారి కూడా ఇండియాలో పూర్తి స్థాయిలో రీస్టార్ట్‌కు రెడీ అయిన ఇండస్ట్రీ టాలీవుడ్డే. ఈ రోజు తెలంగాణలో ఫుల్ ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకుంటున్నాయి. రేపు ఏపీలోనూ థియేటర్లు 50 శాతం అందుబాటులోకి రానున్నాయి.

ఈ రోజు తిమ్మరసు, ఇష్క్ చిత్రాలతో థియేటర్ల ప్రదర్శన పున:ప్రారంభం కానున్నాయి. గత ఏడాది లాగే ఈసారి కూడా శుభారాంభం దక్కాలని ఇండస్ట్రీ బలంగా కోరుకుంటోంది. కొత్త చిత్రాలపై అందరూ ఎంతో ఆశతో ఉన్నారు. స్టార్లు లేకపోయినా మంచి కంటెంట్ ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ రెండు చిత్రాలూ మంచి ఫలితాలందుకుని ఇండస్ట్రీకి మళ్లీ ఊపు తేవాలని ఆశిస్తున్నారు.

ఇంతకుముందు నిఖిల్‌తో ‘కిరాక్ పార్టీ’ అనే రీమేక్ మూవీ తీసి దెబ్బ తిన్న శరణ్ కొప్పిశెట్టి ఈసారి ఒరిజినల్ స్క్రిప్టుతో ‘తిమ్మరసు’ చేశాడు. టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించాడు. దీని ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. మంచి థ్రిల్లర్ మూవీలా కనిపించింది.

ఇక మరో చిత్రం ‘ఇష్క్’ సైతం థ్రిల్లర్ మూవీనే. మలయాళంలో అదే పేరుతో తెరకెక్కిన చిత్రానికిది రీమేక్. తేజ సజ్జా-ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజు అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. మరి ఈ రెండు చిత్రాలకూ ఎలాంటి స్పందన వస్తుందో.. కరోనా-2 బ్రేక్ తర్వాత టాలీవుడ్‌కు ఎలాంటి ఆరంభం దక్కుతుందో చూడాలి.