రజినీకి తెలుగు అభిమానుల డిమాండ్

Annathai

తెలుగులో మన స్టార్ హీరోలకు దీటుగా మార్కెట్ సంపాదించిన పరభాషా నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. నిజానికి ఆయన్ని పరభాషా నటుడిగా మన వాళ్లు ఎప్పుడూ చూడలేదు. ‘బాషా’ దగ్గర్నుంచి మనవాడిలాగే చూస్తున్నారు. ఆయన సినిమాలకు అసాధారణ విజయాలను అందిస్తూనే ఉన్నారు. అప్పట్లో ‘నరసింహా’ సినిమా ధాటికి తెలుగు సినిమాలు షేక్ అయిపోయాయి.
చంద్రముఖి, శివాజి, రోబో సినిమాలు కూడా అలాంటిలాంటి సంచలనం రేపలేదు. రజినీ సినిమాకు పోటీగా తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి ఇక్కడి స్టార్లు భయపడేవారంటే అతిశయోక్తి కాదు. ఐతే ఇంత మంచి ఫాలోయింగ్, మార్కెట్‌ను రజినీ చేజేతులా దెబ్బ తీసుకున్నాడు.

వరుసగా చెత్త సినిమాలు చేయడం ఒక కారణమైతే, సూర్య లాగా మన ప్రేక్షకులపై ఆపేక్ష చూపించకపోవడం, తనుగా ఇక్కడికి వచ్చి ప్రమోషన్లు సరిగా చేయకపోవడం లాంటి వేరే కారణాలు కూడా ఇందుకు దోహదం చేశాయి.

చివరగా రజినీ నుంచి వచ్చిన ‘దర్బార్’ తమిళంలో ఓ మోస్తరుగానే ఆడినా.. తెలుగులో కనీస స్పందన తెచ్చుకోలేకపోయింది. అందుకు తెలుగులో రజినీ కనీస స్థాయిలో కూడా తన చిత్రాన్ని ప్రమోట్ చేయకపోవడం ఓ కారణం. కట్ చేస్తే రజినీ ప్రస్తుతం ‘అన్నాత్తె’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మామూలుగా రజినీ తమిళం, తెలుగు భాషలకు కామన్‌గా ఉండేలా టైటిల్ పెడుతుంటాడు. అక్కడో టైటిల్, ఇక్కడో టైటిల్ అన్నట్లుగా ఉండదు.

కానీ తన కొత్త సినిమాకు మాత్రం ‘అన్నాత్తె’ అని అరవ పేరు పెట్టుకున్నాడు. ఇది అనౌన్స్ చేసి ఏడాది దాటింది. పేర్లు వేరు వేరుగా ఉన్నా కనీసం తెలుగులో కూడా ఒకేసారి టైటిల్ ప్రకటించి ఉంటే బాగుండేది. కానీ రజినీ టీం అలా చేయలేదు.

ఇప్పుడు సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న టైంలోనూ తెలుగు టైటిల్ గురించి ఊసే లేదు. ఇది సూపర్ స్టార్ తెలుగు అభిమానులకు ఆవేదన కలిగించింది. దీంతో #WeWantAnnaattheTeluguTitle అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దీని మీద పెద్ద ఎత్తునే ట్వీట్లు పడ్డాయి. ఇండియా లెవల్లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది.

ఈ సందర్భంగా తెలుగులో రజినీ రికార్డులు, ఆయన సినిమాల వసూళ్లు, సూపర్ స్టార్ సినిమాల రిలీజ్ సందర్భంగా మేనియా.. లాంటి విశేషాలను అభిమానులు పంచుకున్నారు. ఇంత ప్రేమ చూపించే తెలుగు ఫ్యాన్స్ మీద రజినీ కొంచెం దృష్టిపెట్టి ‘అన్నాత్తె’ తెలుగు టైటిలేదో త్వరగా అనౌన్స్ చేస్తే బాగుంటుంది.