మాస్ రాజా సినిమా క్యాన్సిల్?

మాస్ రాజా కెరీర్లో బ్యాడ్ ఫేజ్ కొనసాగుతూనే ఉంది. అతను చివరగా ‘రాజా ది గ్రేట్’తో హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఏ సినిమా ఆడలేదు. దానికి ముందు కూడా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. గత మూడేళ్లలో ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ లాంటి పెద్ద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు.

చివరగా వచ్చిన ‘డిస్కో రాజా’ అయితే మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. ప్రస్తుతం అతడి ఆశలన్నీ ‘క్రాక్’ మీదే ఉన్నాయి. ఆ సినిమాపై అయితే మంచి అంచనాలే ఉన్నాయి. ప్రయోగాలతో చేతులు కాల్చుకున్న నేపథ్యంలో తనకు బాగా అలవాటైన మాస్ సినిమాలే చేయడానికి పూనుకున్నాడు రవితేజ.

ఇందులో భాగంగానే రమేష్ వర్మతో ఓ మసాలా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మాస్ రాజా. రమేష్‌తో ‘రాక్షసుడు’ తీసిన కోనేరు సత్యనారాయణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కరోనా ప్రభావం మొదలవడానికి ముందు ఈ సినిమాకు అంగీకారం కుదిరింది. ఐతే లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నట్లు సమాచారం.

బడ్జెట్ సమస్యలతో ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లుగా చెబుతున్నారు. స్క్రిప్టు మీద కూడా అంత భరోసా లేకపోవడం, రవితేజ మార్కెట్ కూడా బాగా దెబ్బ తిని ఉండటం, బడ్జెట్ విషయంలో తర్జన భర్జనలు నడుస్తుండటంతో ఈ సినిమాను ఆపేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారట. ఐతే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. లాక్ డౌన్ తర్వాత ఏ సంగతీ తేలే అవకాశముంది.