లాక్ డౌన్ ఎఫెక్ట్.. నటుడి ఆత్మహత్య

కరోనా వైరస్ కంటే కూడా.. దాన్ని అదుపు చేయడం కోసం అమలు చేసిన లాక్ డౌన్‌తో ఎక్కువ ప్రాణాలు పోతాయంటూ కొందరు నిపుణులు వ్యాఖ్యానించారు. ఇది అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తే. లాక్ డౌన్ ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న జీవితాలెన్నో. ఇండియాలో కోట్లమంది ఉద్యోగాలు లాక్ డౌన్ కారణంగా ఊడిపోతున్నాయి. వీరిలో ఎంతమంది తమ జీవితాలు బలి తీసుకుంటారో చెప్పలేం.

ఇప్పటికే ఆకలితో, ప్రమాదాలతో, ఇంకేవో కారణాలతో ఎంతోమంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఐతే లాక్ డౌన్ కాస్త పేరున్న వారిని కూడా కుంగదీసి ప్రాణాలు తీసుకునేలా చేస్తుందనడానికి ముంబయిలో ఓ యువ నటుడి ఆత్మహత్యే నిదర్శనం.

లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేక చిన్న స్థాయి నటీనటులు, టెక్నీషియన్లు, సినీ కార్మకులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల ఓ యువ నటి ఇబ్బందుల్లో ఉంటే ఆమె మేకప్ మ్యాన్ రూ.15 వేలు సాయం చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇలాంటి సాయం ఏదీ అందలేదో ఏమో.. లేక భవిష్యత్ భయంకరంగా అనిపించిందో ఏమో.. పంజాబీ నటుడు మన్మీత్ గైవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మ హత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని తెలుస్తుంది.

పంజాబ్‌కు చెందిన మన్మీత్ ప్రస్తుతం ముంబైలోని ఖర్గార్‌లో తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. షూటింగ్స్ లేని కారణంగా ఆర్ధిక ఇబ్బందులకు గురి అయిన మన్మీత్ ఉరేసుకుని చనిపోయినట్లు అతనిస్నేహితుడు మంజీత్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు వెల్లడించాడు. మన్మీత్ ‘ఆదత్ సే మజ్బూర్’, ‘కుల్దీపాక్’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. పలు టీవీ కార్యక్రమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించాడు.