అద్భుత ప్రపంచంలోకి ప్రభాస్

‘బాహుబలి’లో ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. ప్రేక్షకులకు కూడా ఆ కొత్త ప్రపంచం అద్భుతంగా అనిపించింది. దానికి అపూర్వ ఆదరణ కట్టబెట్టారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ను మామూలు సినిమాల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడట్లేదు. అతడితో సినిమాలు ప్లాన్ చేస్తున్న ఫిలిం మేకర్స్ ప్రణాళికలు కూడా భారీగానే ఉంటున్నాయి. ప్రభాస్ లైన్లో పెట్టిన వాటిలో అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఇది ప్రభాస్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందన్న అంచనాలున్నాయి.

ఎందుకంటే ఇందులో ప్రభాస్ చేయబోయేది రాముడి పాత్ర. ఇది రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇప్పుడు రామాయణ గాథను కొత్తగా ఆవిష్కరించేదేముంది అనేవాళ్లు కూడా లేకపోలేదు కానీ.. ఇప్పుడున్న సాంకేతికత ఆధారంగా ఈ పురాగణ గాథను విజువల్ వండర్ లాగా తీర్చిదిద్దాలని దర్శకుడు ఓం రౌత్ భావిస్తున్నాడు.

ఇందుకోసం ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను తీసుకున్నాడు. ‘ఆదిపురుష్’కు ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్సే అతి పెద్ద ఆకర్షణ అవుతాయని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఒక కొత్త లోకాన్నే సృష్టిస్తున్నారట. ముంబయిలోని మధ ఐలాండ్‌లో భారీ ఎత్తున అడవి సెట్ వేశారట. ఇక్కడే సినిమా తొలి షెడ్యూల్ షూట్ చేయబోతున్నారు.

ఈ దీవిలో భారీ ఖర్చుతో అద్భుతమైన సెట్టింగ్స్ రూపుదిద్దుకున్నాయని.. అక్కడికి వెళ్తే ఓ కొత్త లోకంలోకి వెళ్లినట్లే ఉంటుందని.. కీలక సన్నివేశాల చిత్రీకరణ అంతా ఇక్కడే సాగుతుందని.. ఏ రకమైన డిస్టబెన్స్ లేకుండా.. తక్కువ మంది కాస్ట్ అండ్ క్రూతో ఇక్కడ షూటింగ్ చేయబోతున్నారని సమాచారం. కరోనా నేపథ్యంలో ఏ సమయంలోనైనా 25 మందికి మించి సెట్స్‌లో లేకుండా స్వీయ పరిమితి విధించుకుని ఇక్కడ చిత్రీకరణ సాగించనున్నారట.