పుష్ష‌ని వాడేస్తున్న ఆచార్య‌

ఓ సినిమా కోసం వేసిన‌ సెట్ ని మ‌రో సినిమా కోస‌మూ వాడేయ‌డం ఈరోజుల్లో అరుదైన విష‌య‌మే. ఎందుకంటే.. ప్రేక్ష‌కులు ఇట్టే ప‌ట్టేస్తున్నారు. ‘ఇది ఫ‌లానా సినిమాలో ఉంది క‌దా’ అని చెప్పేస్తున్నారు.

అందుకే… సెట్స్‌ని రిపీట్ చేయ‌డానికి ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. కానీ కొన్ని ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భాల్లో పాత సెట్ల‌కే కొత్త హంగులు పూసి.. వాడుకోవాల్సివ‌స్తుంది. ‘ఆచార్య‌’ విష‌యంలో అదే జ‌రుగుతోంది.

‘పుష్ష‌’ కోసం వేసిన సెట్లో ఇప్పుడు ‘ఆచార్య‌’ రంగంలోకి దిగ‌బోతున్నాడు. ‘పుష్ష‌’ షూటింగ్ ఇటీవ‌ల మారేడు మ‌ల్లిలో జ‌రిగింది. అక్క‌డ షెడ్యూల్ కూడా అయిపోయింది. ఇప్పుడు వ‌చ్చే వారంలో ‘ఆచార్య‌’ షూటింగ్ అక్క‌డే జ‌ర‌గ‌బోతోంది. మారేడు మ‌ల్లిలో ‘పుష్ష‌’ పెద్ద షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఎక్కువ రోజులు అక్క‌డ ఉండాల్సిరావ‌డంతో.. కొన్ని గెస్ట్ హోస్‌ల‌ను నిర్మించుకుంది.

అక్క‌డే ఇప్పుడు ‘ఆచార్య‌’ యూనిట్ కూడా ఉండ‌బోతోంది. పుష్ష కోసం వేసిన సెట్ల‌ని చిన్న చిన్న మార్పులు చేసుకుని ‘ఆచార్య‌’ కోసం వాడుకోబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో రామ్ చ‌ర‌ణ్‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తార‌ట‌. వారం ప‌ది రోజుల్లో ఇక్క‌డి షెడ్యూల్ పూర్త‌వుతుంద‌ని, ఆ త‌ర‌వాత హైద‌రాబాద్ లో చిరు – చ‌ర‌ణ్‌ల‌పై కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. మే 13న ఆచార్య విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.