ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఎప్పుడంటే..?

‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. లాక్ డౌన్ లేకుంటే ఈ పాటికి షూటింగ్ పూర్తయిపోయేదేమో. ఈ ఏడాదే రిలీజ్ కూడా ఉండేది. కానీ చిత్ర బృందం ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పున:ప్రారంభం అవుతుందో.. ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో.. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించాల్సిన సినిమా ఎప్పుడు మొదలై.. ఎప్పుడు పూర్తయి.. ఎప్పుడు విడుదలవుతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఐతే ప్రభాస్ సినిమా విషయంలో నిర్మాత అశ్వినీదత్ అయితే పక్కా ప్రణాళికతోనే ఉన్నట్లున్నారు. ఆ సినిమాను ఎప్పుడు మొదలుపెట్టాలి.. ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నది ఆయన ఇప్పటికే డిసైట్ చేసేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దత్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అక్టోబరులోనే ప్రభాస్-అశ్విన్ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పారు. 2022 ఏప్రిల్ కల్లా సినిమాను విడుదలకు సిద్ధం చేయాలన్నది తమ ప్రణాళిక అని కూడా ఆయన వెల్లడించారు. బహుశా షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక రాధాకృష్ణ కుమార్ సినిమాను రెండు నెలల్లో ముగించి అక్టోబరులో అశ్విన్ సినిమాను మొదలుపెడతాడేమో ప్రభాస్.

2022 ఏప్రిల్ రిలీజ్ అంటున్నారంటే సినిమా చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఏడాదిన్న సమయం పడుతుందన్నమాట. ఇక ప్రభాస్‌తో సినిమా చేయడం గురించి దత్ మాట్లాడుతూ.. అతణ్ని తమ సంస్థ ద్వారానే హీరోగా పరిచయం చేయాలని అనుకున్నామని, కుదర్లేదని.. ఐతే ఈలోపు అతను అంచెలంచెలుగా ఎదిగి.. ‘బాహుబలి’ సినిమాతో తిరుగులేని స్థాయిని అందుకున్నాడని.. ‘మహానటి’ తర్వాత నాగ్ అశ్విన్ ఎలాంటి కథ చెబుతాడో అని ఎదురు చూశానని.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసే కథ తయారు చేశాడని.. దానికి ప్రభాసే కరెక్ట్ అని చెప్పడంతో తాను అడిగానని.. వెంటనే ప్రభాస్ ఓకే అన్నాడని దత్ వెల్లడించాడు.